
పోషకాలు అందేదెలా?
బీఆర్‌ఎస్ హయాంలో అమలు..
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందించే వివిధ రకాల పౌష్టికాహార పదార్థాలు వారి శారీరక, మానసిక ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంత విద్యార్థులకు మరింతగా ప్రయోజనం చేకూరుతుంది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 1 నుంచి రాగి జావ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ జిల్లా, మండల, కాంప్లెక్స్ విద్యాధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో జిల్లాలో ఎక్కడా ఈ పథకం ఇంతవరకూ అమలు కాలేదు.
స్నాక్స్‌పైనా కొరవడిన స్పష్టత..
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఈ తరగతులు ప్రారంభిస్తే విద్యార్థులకు రెండు పూటలా స్నాక్స్ అందించాలి. ఇందుకోసం ఒక్కో విద్యార్థికి రూ.15 చొప్పున కేటాయిస్తామని, వాటితో పల్లిపట్టి, అరటిపండ్లు, బిస్కట్లతో పాటు విద్యార్థులకు అదనపు శక్తినిచ్చే అల్పాహారం అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇంతవరకూ నిధులు విడుదల కాకపోవడంతో విద్యార్థులకు స్నాక్స్ అందించడం ఎలా అని ప్రధానోపాధ్యాయులు ఆలోచనలో పడ్డారు. స్నాక్స్ అందించేందుకు ఎవరైనా దాతలు ముందుకొస్తారా అని ప్రయత్నాలు చేస్తున్నారు.
భారమవుతున్న గుడ్డు..
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డు అందించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఒక్కో గుడ్డుకు రూ.6 చొప్పున భోజన కార్మికులకు అందిస్తుండగా.. మార్కెట్‌లో ప్రస్తుతం గుడ్డు ధర రూ.7, కొన్నిచోట్ల రూ.8 కూడా ఉంది. దీంతో తమపై భారం పడుతోందంటూ కార్మికులు విద్యార్థులకు సక్రమంగా కోడిగుడ్డు వడ్డించడం లేదు. కొన్ని పాఠశాలల్లో మాత్రం హెచ్‌ఎంలు బలవంతంతో అందిస్తున్నారు. ఇక గత ప్రభుత్వ హయాంలో మండలానికి ఒక పాఠశాలను ఎంపిక చేసి విద్యార్థులకు ఉదయం అల్పాహారం కింద రోజుకో రకమైన టిఫిన్ పెట్టేవారు. క్రమంగా అన్ని పాఠశాలల్లో అమలు చేయాలని నిర్ణయించారు. కానీ ఎన్నికల తర్వాత ఆ పథకం కూడా నిలిచిపోయింది. ఇలా విద్యార్థులకు అందాల్సిన అన్ని రకాల పోషకాహారాలు నిలిచిపోతుండడంతో వారి ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రాగిజావ అమలుపై డీఈఓ నాగలక్ష్మిని వివరణ కోరగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఒక ట్రస్ట్‌కు ఈ బాధ్యత అప్పగించిందని, ప్రస్తుతం వారు సిద్ధంగా ఉన్నందున వారం రోజుల్లో జిల్లాలో ప్రారంభిస్తామని చెప్పారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి ఒక గంట ముందు విద్యార్థులకు బెల్లంతో కాచిన రాగిజావ అందించేవారు. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ పథకం నిలిచిపోయింది. కాగా, సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సర్కారు స్కూళ్లలో రాగిజావ అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో ఈ పథకం ఇటీవల ప్రారంభమైనా.. ఇక్కడ మాత్రం ఇంకా అమలుకు నోచుకోలేదు. అయితే పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తయారుచేసే కార్మికులు.. రాగిజావ కాచడం తమకు అదనపు పని అని, ఒక్కో విద్యార్థికి రూ.2 చొప్పున అదనంగా చెల్లిస్తే సిద్ధమని ముందుగానే ప్రకటించారు. జావ తయారీకి అవసరమైన వంట గ్యాస్ కూడా ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కానీ ప్రభుత్వం మాత్రం ఒక్కో విద్యార్థికి అదనంగా 25 పైసలు(పావలా) మాత్రమే చెల్లిస్తామని ప్రకటించింది. దీంతో రాగి జావ కాయడం కుదరదని భోజన కార్మికులు స్పష్టం చేస్తున్నారు.