
23 నుంచి దసరా వేడుకలు
రామాలయంలో రోజుకో అలంకరణలో మహాలక్ష్మి దర్శనం
అక్టోబర్ 2న శమీ, ఆయుధ పూజ, శ్రీ లీలా మహోత్సవం
7న శబరి స్మృతియాత్ర, వాల్మీకి జయంతి
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 23 నుంచి శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆలయ అధికారులు అశ్వయుజ మాసంలో జరిగే ఉత్సవాలు, విజయ దశమి వేడుకల వివరాలను వెల్లడించారు. అక్టోబర్ 2న జరిగే విజయదశమి వేడుకలతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఆలయంలో కొలువై ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారు 23 నుంచి రోజుకో అలంకరణలో భక్తులకు కనువిందు చేయనున్నారు. అక్టోబర్ 7న శబరి స్మృతియాత్ర నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ దామోదర్‌రావు, వైదిక కమిటీ సభ్యులు తెలిపారు.
తొమ్మిదిరోజులపాటు ప్రత్యేక పూజలు
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతీ ఏడాది తొమ్మిది రోజులపాటు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేస్తారు. స్వామివారి సన్నిధిలో తొమ్మిది రోజులపాటు అంగరంగ వైభవంగా వేడుకలు జరుపుతారు. దశమి రోజున భక్తరామదాసు నిర్మించిన దసరా మండపంలో శమీ, ఆయుధ పూజలు, లీలా మహోత్సవం కనుల పండువగా నిర్వహిస్తారు. కాగా ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో 24 నుంచి 2వ తేదీ వరకు శ్రీరామాయణ పారాయణం జరగనుంది. ఇందులో భక్తులను, స్వామి వారి ఆరాధకులను ఈ ఏడాది భాగస్వామ్యం చేయనున్నారు. శ్రీలక్ష్మి అమ్మవారి సన్నిధిలో అభిషేకం, చిత్రకూట మండపంలో సామూహిక శ్రీ రామాయణ పారాయణం, మధ్యాహ్నం శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి సన్నిఽధిలో సామూహిక కుంకుమార్చనలు జరగనున్నాయి. అక్టోబర్ 2న శమీ, ఆయుధ పూజ, శ్రీ లీలా మహోత్సవం నిర్వహించనున్నారు.
వచ్చే నెల 7న శబరి స్మృతి యాత్ర
వచ్చే నెల 7వ తేదీన అశ్వయుజ మాస పౌర్ణిమ సందర్భంగా శబరి స్మృతి యాత్రను జరపనున్నారు. రాముడి అపర భక్తురాలు శబరికి ఫల, పుష్పాలతో అంజలి ఘటించనున్నారు. అదే రోజున వాల్మీకి జయంతి వేడుకలకు సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్ 20వ తేదీన నరక చతుర్దశి దీపావళి సందర్భంగా మూలమూర్తులకు తెల్లవారుజామున అభిషేకం, సాయంత్రం మంగళ స్నానాలు, ఇతర ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
తేదీ అలంకారం పారాయణం
ఈ నెల 23న ఆదిలక్ష్మి బాలకాండ
24న సంతాన లక్ష్మి అయోధ్యకాండ
25న గజలక్ష్మి అయోధ్యకాండ
26న ధనలక్ష్మి అరణ్యకాండ
27న ధాన్య లక్ష్మి కిష్కింధకాండ
28న విజయలక్ష్మి సుందరకాండ
29న ఐశ్యర్యలక్ష్మి యుద్ధకాండ
30న వీరలక్ష్మి యుద్ధకాండ
అక్టోబర్ 1న మహాలక్ష్మి (నిజరూప) యుద్ధకాండ