
తరలివస్తున్న గణనాథులు
నేడు జిల్లావ్యాప్తంగా విగ్రహాలను నిమజ్జనానికి తరలించనున్న భక్తులు
పోలీసు, ఇరిగేషన్, రెవెన్యూ, పీఆర్, విద్యుత్ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు
భద్రాచలంఅర్బన్: భక్తి, శ్రద్ధలతో పూజలందుకున్న గణనాథులను గంగమ్మ ఒడికి తరలిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా శనివారం వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం భద్రాచలం గోదావరి వద్ద పోలీసు, ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యుత్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ బందోబస్తు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నదిలో గతేడాది 1,300 గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేయగా, ఈసారి జిల్లావ్యాప్తంగా 2 వేల ప్రతిమలు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 729 విగ్రహాలను గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. భద్రాచలంలో ప్రతిష్టించిన అధిక శాతం వినాయక ప్రతిమల నిమజ్జనం మొదలుకాగా, రెండు, మూడు రోజులుగా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు వినాయక విగ్రహాలను తీసుకొస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలతోపాటు సమీప జిల్లాల నుంచి భక్తులు తీసుకొచ్చే వినాయక విగ్రహాల నిమజ్జనం శని, ఆదివారాల్లో కొనసాగనుంది. భద్రాచలంలోని మండపాల వద్ద లడ్డూ వేలం పాట నిర్వహించాక గణపతి బప్పా మోరియా అంటూ నిమజ్జనానికి శోభాయాత్రగా బయలుదేరారు. శోభాయాత్ర వీక్షణకు భక్తులు బారులుదీరడంతో పట్టణంలోని రహదారులు, గోదావరి కరకట్ట వద్ద రద్దీ నెలకొంది. భక్తులు తీసుకొచ్చిన విగ్రహాలను గోదావరి తీరంలో దించి.. ఆ తర్వాత వరుస క్రమంలో క్రేన్ల ద్వారా లాంచీల్లో ఎక్కించి గోదావరిలో నిమజ్జనం చేస్తున్నారు. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నదిలోకి విగ్రహాలను తీసుకెళ్లేలా పడవలను సమకూర్చి గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. గ్రామ పంచాయతీ సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నారు.
మాది హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్. రాధేకృష్ణ యూత్ ఆధ్వర్యంలో వినాయకుడికి పూజలు నిర్వహించి భద్రాచలం వద్ద గోదావరిలో నిమజ్జనం చేసేందుకు వచ్చాం. మా చేతులతో నిమజ్జనం చేయాలని అనుకున్నాం. కానీ పోలీసుల సూచనలతో సిబ్బందికి విగ్రహాన్ని అప్పగించాం. మేము నాలుగేళ్లుగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మూడుసార్లు హైదరాబాద్‌లోనే నిమజ్జనం చేశాం. ఈసారే భద్రాచలం వచ్చాం.
– పాండురంగ, రాధేకృష్ణ యూత్, హైదరాబాద్
ఇప్పటికే దూరప్రాంతాల నుంచి భద్రగిరికి వినాయక ప్రతిమలు

తరలివస్తున్న గణనాథులు

తరలివస్తున్న గణనాథులు