
రెండేళ్లుగా సా..గుతూ !
● అమృత్ భారత్ పనుల్లో జాప్యం ● 60 శాతం మాత్రమే పూర్తయ్యాయని అంచనా ● పనుల వివరాలు వెల్లడించేందుకు రైల్వే అధికారుల నిరాకరణ ● ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు
కొత్తగూడెంఅర్బన్: అమృత్ భారత్ పథకానికి భద్రాచలం రోడ్(కొత్తగూడెం) రైల్వే స్టేషన్ ఎంపికై మంగళవారానికి రెండేళ్లు పూర్తయింది. ఈ పథకం కింద స్టేషన్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు ప్లాట్‌ఫాంపై రేకుల షెడ్‌లు మినహా మిగిలినవన్నీ నత్తనడకనే సాగుతున్నాయి. అయితే ఈ పథకం కింద ఏయే పనులు చేస్తున్నారు, అవి ఎంతవరకు పూర్తయ్యాయి, ఎన్ని నిధులు ఖర్చు చేశారు అనేది పర్యవేక్షించే బాధ్యత ఐఓడబ్ల్యూ విభాగం అధికారులదే. అయితే ఆ విభాగం అధికారిని సంప్రదిస్తే తన వద్ద ఎలాంటి సమాచారం లేదని, డోర్నకల్ లేదా సికింద్రాబాద్ అధికారులను అడగాలని అంటున్నారు. కనీసం వారి ఫోన్ నంబర్లు కూడా తనకు తెలియదని చెప్పడం గమనార్హం.
ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు..
పనుల్లో జాప్యంతో పాటు రైల్వే స్టేషన్‌లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ప్లాట్‌ఫాంపై రేకుల షెడ్‌లు లేక ఎండ, వానల్లోనే వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. వెయిటింగ్ హాళ్లు పూర్తి కాకపోవడంతో ఎక్కడ కూర్చోవాలో తెలియడం లేదని వాపోతున్నారు. కొందరు ప్రయాణికులు స్టేషన్ ఆవరణలో ఉండే ఆటోలు, కార్లలో, ఫుట్ ఓవర్ బ్రిడ్జిపైన వేచి ఉంటున్నారు. అమృత్ భారత్ పథకంతో అత్యాధునిక సదుపాయాలు కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా.. ఇక్కడ మాత్రం ఉన్న వసతులు కూడా తొలగించారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
60 శాతం మేరకే పనులు..
అమృత్ భారత్ పథకం కింద 2023 ఆగస్టు 5న భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్‌ను ఎంపిక చేశారు. అభివృద్ధి పనుల కోసం రూ.25.41 కోట్లు కేటాయించారు. అయితే నాడు ప్రారంభించిన పనులు ఇంకా కొనసా..గుతూనే ఉన్నాయి. పనులు దక్కించుకున్న కాంట్రాకర్లు నెలల తరబడి జాప్యం చేయడం, రైల్వే అధికారులు వారితో చర్చలు జరిపి పనులు ప్రారంభించేసరికి జాప్యం జరుగుతోంది. ఇప్పటివరకు 60 శాతం మేర మాత్రమే పనులు పూర్తయ్యాయని తెలుస్తోంది. కొత్తగూడెం కార్పొరేషన్‌గా మారిన తర్వాత రైలు ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతోంది. కానీ అందుకు తగ్గట్టుగా సౌకర్యాలు లేకపోవడంతో స్టేషన్ అధికారుల తీరుపై ప్రయాణికులు మండిపడుతున్నారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.25.41 కోట్లు కేటాయించగా, పూర్తయిన పనుల వివరాలను అధికారులు సర్కారుకు పంపితేనే నిధులు విడుదలవుతున్నాయి. ఇంకా విద్యుద్దీకరణ, వెయిటింగ్ హాళ్లు, ఎస్కలేటర్, లిఫ్ట్ పనులు పూర్తి కాలేదు.
పనులు వేగవంతం చేయాలి
భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న పనులు వేగవంతం చేయాలని, ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలని సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు సమావేశంలో కోరాం. ప్రస్తుతం కూడా రైల్వే స్టేషన్ ఏఓను కలిసి పనులు ఎంత వరకు జరిగాయనే వివరాలు సేకరిస్తున్నాం. పనుల వేగవంతానికి చర్యలు తీసుకుంటాం.
– శ్రీనివాసరెడ్డి, సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్

రెండేళ్లుగా సా..గుతూ !