
భవితకు బాటలు..
ఫిజియోథెరపీతో సత్ఫలితాలు
జిల్లాలోని 30 భవిత కేంద్రాల్లో 36 మంది ఐఈఆర్‌పీలు పనిచేస్తుండగా, ఇంకా పది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రతీ కేంద్రంలో ఆయా ఒకరు ఉన్నారు. 21 రకాల వైక్యలం కలిగిన పిల్లలు జిల్లావ్యాప్తంగా 2,231మంది ఉన్నారు. వీరిలో 1,925 మంది వివిధ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. భవిత కేంద్రాల్లో 306 మంది విద్యాభ్యాసం చేస్తుండగా, బడిబయట 45 మంది పిల్లలు ఉన్నారు. హోం బేస్డ్ ఎడ్యుకేషన్‌లో ప్రతీ శనివారం ఐఈఆర్‌పీలు 144 మంది పిల్లల ఇళ్లకు వెళ్లి కృత్యాధార బోధన చేస్తున్నారు. భవిత కేంద్రాల్లో మెరుగుపడ్డ పిల్లలను సాధారణ పాఠశాలల్లో చేర్చుతున్నారు. మండల కేంద్రాల్లో 9మంది ఫిజియోథెరపిస్ట్‌లు వారానికి రెండు రోజుల చొప్పున క్యాంపులను నిర్వహిస్తూ 148 మంది దివ్యాంగ పిల్లలకు ఫిజియోథెరపీ చేస్తున్నారు. మంచం మీద కదలలేని స్థితిలో ఉన్న పిల్లలు సైతం ఫిజియోథెరపీ సేవలు పొందాక నిలబడగలుగుతున్నారు. కొందరు నడవగలుగుతున్నారు కూడా.
ప్రతీ విద్యార్థికి అలవెన్స్
అర్హత కలిగిన దివ్యాంగ విద్యార్థులకు నెలకు రూ. 500 ట్రాన్స్‌పోర్టు అలవెన్స్, రూ.500 ఎస్కార్ట్ అలవెన్స్, రూ.60 రీడర్ అలవెన్స్, ప్రత్యేకంగా బాలికలకు రూ.200 చొప్పున ఉపకార వేతనాలు ఇస్తున్నారు. 2024–25 విద్యా సంవత్సరంలో 751 మంది పిల్లలకు రూ.23,32,720 అలవెన్స్‌లు, ఉపకార వేతనాలు అందించారు. 387 మంది ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను గుర్తించి, వారిలో 288 మందికి రూ. 25,80,914 విలువైన 348 పరికరాలు కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఏటా జనవరి, మే నెలల్లో సర్వే నిర్వహిస్తూ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను గుర్తించి వివరాలు నమోదు చేస్తున్నారు. యూడైస్ వెబ్‌సెట్, ప్రబంధన్ పోర్టల్‌లో కూడా వివరాలు ఆన్‌లైన్ చేస్తున్నారు.
భవిత కేంద్రాల్లో
ఫిజియోథెరపీ, విద్యాభ్యాసం..
ప్రత్యేకావసరాలు కలిగిన చిన్నారులకు సేవలు
ఏడాదికోసారి పరికరాలు అందజేస్తున్న ప్రభుత్వం
కొత్త భవనాలు, మరమ్మతులకు రూ.1.38 కోట్లు మంజూరు
ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం సమ్మిళిత విద్య భవిత కేంద్రాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 23 మండలాల్లో 30 కేంద్రాలు ఉండగా, వీటిల్లో విద్యాభాస్యంతోపాటు ఫిజియోథెరపీ సేవలు అందిస్తున్నారు. పరికరాలు, అలవెన్స్‌లు పంపిణీ చేస్తున్నారు. ఇటీవల కొత్తగూడెం వచ్చిన రాష్ట్ర ఉన్నతవిద్యాశాఖ ముఖ్యకార్యదర్శి యోగితారాణా జిల్లా కేంద్రం రైటర్‌బస్తీలోని భవిత కేంద్రాన్ని సందర్శించి పిల్లలకు అందుతున్న సేవలు, విద్యాభ్యాసంపై ఆరా తీశారు. సేవల్లో నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు. – కొత్తగూడెంఅర్బన్
నూతన భవనాలకు నిధులు..
భవితకేంద్రాలకు కొత్తగూడెం, పాల్వంచ, భద్రా చలం, మణుగూరు, ఇల్లెందు, అశ్వారావుపేట ఆరు మండలాల్లో శాశ్వత భవనాలు ఉన్నాయి. మిగిలిన 24 కేంద్రాలు ప్రభుత్వ పాఠశాల భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. ఇటీవల శాశ్వత భవనాల మరమ్మతులు, పరికరాల ఏర్పాటుతో పాటు 17 నూతన భవనాల నిర్మాణాలకు రూ. 1.38కోట్ల నిధులు మంజూరయ్యాయి. దీంతో ఆళ్లపల్లి, అన్నపురెడ్డిపల్లి,అశ్వాపురం, బూర్గంపా డు,చర్ల, చండ్రుగొండ, చుంచుపల్లి, దమ్మపేట, దుమ్ముగూడెం, గుండాల, జూలూరుపాడు, కరకగూడెం, లక్ష్మీదేవిపల్లి, ములకలపల్లి, పినపాక, సుజాతనగర్, టేకులపల్లి మండలాల్లో కొత్త భవనాలు నిర్మించనున్నారు. కాగా ఇటీవల కురిసిన వర్షాలకు కేంద్రాలు అస్తవ్యస్తంగా మారాయి. వర్షపు నీరు నిలిచి పిల్లలు అవస్థలు పడుతున్నా రు. ఆవరణల్లో పిచ్చిమొక్కలు మొలిచి దోమలు వృద్ధిచెందుతున్నాయి. విద్యాధికారులు పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, నూతన భవన నిర్మాణాలు, మరమ్మతులు త్వరితగతిన చేపట్టాలని తల్లిదండ్రులు, సహాయకులు కోరుతున్నారు.
అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్నాం
జిల్లాలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఇబ్బందులు పడకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం. అలవెన్స్‌లు సకాలంలో అందజేస్తున్నాం. అవసరమైన పరికరాలను సమకూర్చుతున్నాం. ఫిజియోథెరపీ సేవలు కూడా షెడ్యూల్ ప్రకారం అందించేలా చర్యలు తీసుకుంటున్నాం.
–సైదులు, జిల్లా కో ఆర్డినేటర్

భవితకు బాటలు..

భవితకు బాటలు..

భవితకు బాటలు..