
మేం లేనిదే కాంగ్రెస్ గెలిచిందా?
అశ్వారావుపేట: కాంగ్రెస్ పార్టీని గెలిపించింది సీపీఐ పార్టీనేనని, తమ ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచి గద్దెనెక్కారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సీసీఐ ఎమ్మెల్యేను గెలిపించామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులనుద్దేశించి ఆయన ఈ వ్యాఖ్య లు చేశారు. శనివారం అశ్వారావుపేటలో పార్టీ మూ డో జిల్లా మహాసభలు ప్రారంభమయ్యాయి. తొలు త మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావు పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ స్థానాల్లో 118 ఈజ్ ఈక్వల్ టూ వన్ అని అన్నారని గుర్తుచేశారు. తాము లేకపోతే కాంగ్రెస్‌కు అధికారమే లేదనన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్ మినహా ఇతర పార్టీలతో స్థానిక పరిస్థితులను బట్టి పొత్తు పెట్టుకోవచ్చని జిల్లా నాయకులకు సూచించారు. కాంగ్రెస్‌తో కలిసే ఉన్నామని, ఒప్పందం గౌరవంగానే ఉండాలని హితవు పలికారు.
మావోయిస్టులు మా మిత్రులే..
మార్చి 2026లోగా మావోయిస్టులను లేకుండా చేస్తామని అమిత్ షా అంటున్నారని, లేకుండా చేసేంత తప్పు మావోయిస్టులేం చేశారని ప్రశ్నించారు. చర్చలకు ఆహ్వానించకుండా కాల్పులు జరపడమేంటని ప్రశ్నించారు. తప్పు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. కమ్యూనిస్టుల సిద్ధాంతం ఒకటే అయినా, మార్గాలు వేరు కావడం వల్ల సీపీఐ(ఎం), నక్సలైటు పార్టీలు ఏర్పడ్డాయన్నారు. తెలంగాణ విముక్తి కోసం సాయుధ పోరాటంలో ప్రాణత్యాగం చేసింది కమ్యూనిస్టులేనని గుర్తుచేశారు. మావోయిస్టులతో సహా ఎర్రజెండా పట్టుకున్న ప్రతి ఒక్కరూ తమవాళ్లేనని పేర్కొన్నారు. బలం సంపాదించిన తర్వాతే తుపాకులు పడదామని, అప్పటి వరకు వేచి ఉండాలని మావోయిస్టులకు సూచన చేస్తున్నామని తెలిపారు. కమ్యూనిస్టులు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ సీనియర్ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశ, రాష్ట్ర రాజకీయాల్లో కమ్యూనిస్టులు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు.
బీజేపీకి చరిత్ర లేదు: ఎమ్మెల్సీ నెల్లికంటి
బీజేపీకి చరిత్ర లేదని, రాముడు, అయోధ్య పేరుతో గొడవలు సృష్టించి అధికారంలోకి వచ్చిందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం విమర్శించారు.10 ఏళ్ల పాలనలో మౌలిక సదుపాయాల కల్పన జరగలేదన్నారు. ఢిల్లీలో రైతులు ఆందోళన చేపడితే మోదీ ప్రభుత్వం 800 మందిని పొట్టన పెట్టుకుందని ఆరోపించారు. బీజేపీకి బలమే లేదని, అయినా తాబేదార్‌లు చంద్రబాబు, నితీష్ కుమార్‌ల మద్దతులో అధికారంలోకి వచ్చిందని అన్నారు. సమావేశంలో కేంద్ర కమిటీ సభ్యుడు బాగం హేమంతరావు, రాష్ట్ర నాయకులు బొల్లోజు అయోధ్య, మహ్మద్ మౌలానా, జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా, సయ్యద్ సలీం, ఖమ్మం జిల్లా కార్యదర్శి దండు సురేష్ తదితరులు మాట్లాడారు.
తెలంగాణ విముక్తి కోసం ప్రాణత్యాగం చేసింది కమ్యూనిస్టులే
కాల్పులు ఆపి మావోయిస్టులను
చర్చలకు ఆహ్వానించాలి
మోదీ, అమిత్‌షాల ప్రభుత్వానికి
కాలంచెల్లే రోజులు వచ్చాయి..
సీపీఐ జిల్లా మహాసభల్లో
పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం
ఎమ్మెల్యే కూనంనేని

మేం లేనిదే కాంగ్రెస్ గెలిచిందా?