
అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి
● ఇందిరమ్మ ఇళ్లపై జీపీ కార్యదర్శుల నిర్లక్ష్యం తగదు ● సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి ● దిశ సమావేశంలో ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి
చుంచుపల్లి: అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని ఖమ్మం పార్లమెంటు సభ్యుడు రామసహాయం రఘురామిరెడ్డి అన్నారు. శనివారం ఐడీఓసీలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో దిశ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. గతేడాది అక్టోబర్‌లో నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, పనుల పురోగతిపై అన్ని శాఖల అధికారులతో తొలుత సమీక్ష నిర్వహించారు. పెండింగ్ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు చేసిన ప్రతిపాదనలకు సంబంధించిన పనులు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, తగిన మందులు అందుబాటులో ఉంచాలని చెప్పారు. పీహెచ్‌సీలో అవసరమైన సిబ్బందిని నియమించాలని, పట్వారి గూడెం పీహెచ్‌సీకి అంబులెన్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గుండాలలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయడంతోపాటు పీహెచ్‌సీని 30 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయాలన్నారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న రోడ్ల నిర్మాణంలో జాప్యం జరుగుతోందని ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేయగా.. పనులు పూర్తి చేయడంలో విఫలమైన కాంట్రాక్టర్లను గుర్తించి బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని ఎంపీ అధికారులను ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాల, అంగన్‌వాడీ, పీహెచ్‌సీలకు నూతన భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. రేషన్ షాపుల్లో వేలిముద్రలు పడకపోతే రేషన్ కార్డుకు సెల్ నంబర్ అనుసంధానం చేసి, బియ్యం పంపిణీ చేయాలని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో పంచాయతీ కార్యదర్శులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే, బీఎస్‌ఎన్‌ఎల్, ఉపాధి హామీ పథకం, ఇంజనీరింగ్ తదితర శాఖల ద్వారా చేపడుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలపై చర్చించారు. ప్రభుత్వ పాఠశాలల ప్రహరీ నిర్మాణాలకు మట్టి ఇటుకలు వినియోగించవచచని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సూచించారు. ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, రాందాస్ నాయక్ , ఐటీడీఏ పీఓ రాహుల్, అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన పాల్గొన్నారు.
క్రీడా పరికరాల పంపిణీ
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లా క్రీడల, యువజన శాఖ ఆధ్వర్యంలో రూ. 50 లక్షల విలువైన క్రీడా పరికరాలను శనివారం కలెక్టరేట్‌లో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి పంపిణీ చేశారు. అథ్లెటిక్స్, ఆర్చరీ, బాక్సింగ్, కబడ్డీ, సైక్లింగ్, రెజ్లింగ్, రైఫిల్ షూటింగ్, సాఫ్ట్‌బాల్, హాకీ, వెయిట్ లిఫ్టింగ్, వాలీబాల్, కరాటే, తైక్వాండో తదితర క్రీడల అసోసియేషన్లకు పరికరాలను అందజేశారు. రైఫిల్ షూటింగ్ కోచ్ అబ్దుల్ నబీ, జిల్లా క్రీడల, యువజన శాఖాధికారి ఎం.పరంధామరెడ్డి పాల్గొన్నారు.