
ఎరువులు అధికంగా వాడొద్దు
మునగ తోటను పరిశీలించిన కేవీకే శాస్త్రవేత్తలు
పాల్వంచరూరల్ : మునగ తోటలకు అధికంగా ఎరువులను వినియోగించవద్దని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ టి.భరత్, ఉద్యాన శాస్త్రవేత్త బి.శివ సూచించారు. మండల పరిధిలోని సోములగూడెంలో రైతులు సాగు చేసిన మునగ తోటలను బుధవారం వారు పరిశీలించారు. పంట సంరక్షణ, దిగుబడి తదితర అంశాలపై సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. వానకాలంలో మునగ తోటలో నీరు నిలిస్తే ఆకు పసుపు రంగులోకి మారి పూత, ఆకు రాలిపోతుందని, వర్షపు నీరు తోటలో నిల్వకుండా చూడాలని సూచించారు. చీడపీడల నివారణకు 13 – 0 – 45 మ్యాక్స్ పౌడర్‌ను లీటర్ నీటిలో 5 గ్రాములు కలిపి పిచికారీ చేయాలని చెప్పారు. చెట్లను బొంత పురుగు ఆశించకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏపీఓ పొరండ్ల రంగా, టెక్నికల్ అసిస్టెంట్లు రజిత, సుజాత, నాగేశ్వరరావు, ప్రసన్నకుమార్, రైతులు బాలినేని నాగేశ్వరరావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.