సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: వందేళ్ల క్రితం బొగ్గు ఉత్పత్తితో మొదలైన సింగరేణి ప్రస్థానం బహుముఖంగా సాగుతోంది. థర్మల్, సోలార్ విద్యుత్ ఉత్పత్తితోపాటు తాజాగా రేర్ ఎర్త్ మినరల్స్ మైనింగ్ రంగంలోనూ అడుగులు వేస్తోంది. అయితే గతంలో తలపెట్టిన పనులు పూర్తి చేయడంలో ఆలస్యం చేస్తోందనే అపవాదు మూటగట్టుకుంది. ఇప్పటికే కొత్త గనులకు అనుమతుల సాధనలో తీవ్ర జాప్యంపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు కార్మికుల క్వార్టర్ల నిర్మాణంలోనూ అదే పరిస్థితి నెలకొంది.
రూ. 273 కోట్ల వ్యయంతో..
సింగరేణి సంస్థ రూ. 273 కోట్లతో కొత్తగా 643 క్వార్టర్లు నిర్మించాలని 2022లో నిర్ణయించింది. వీటిలో సత్తుపల్లిలో 81, కొత్తగూడెంలో 558 క్వార్టర్ల నిర్మాణం చేపట్టింది. ఇందులో రుద్రంపూర్‌లో 270, త్రీ ఇంక్లైన్ బంగ్లోస్ ఏరియాలో 83, కొత్తగూడెం కార్పొరేట్ ఏరియా బంగ్లోస్ (ఇల్లెందు గెస్ట్‌హౌస్)లో 14, రైటర్ బస్తీలో 195 క్వార్టర్లు ఉన్నాయి. వీటి నిర్మాణ పనులు 2023 ఆరంభంలోనే ప్రారంభమయ్యాయి. 2024 ఆగస్టు /సెప్టెంబరు నాటికి పూర్తి కావాల్సి ఉంది. ఏడాది క్రితమే గడువు ముగిసినా ఇప్పటివరకు క్వార్టర్ల నిర్మాణం పూర్తికాలేదు. ఆర్థిక పరిపుష్టి కలిగిన సింగరేణి సంస్థకు నిధుల కొరత లేదు. అయినా క్వార్టర్ల నిర్మాణంలో జాప్యం జరుగుతుండగా, ఇందుకు అధికారుల పర్యవేక్షణ లోపమే కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే అన్ని ఏరియాల్లో కలిపి సుమారు 12 వేలకు పైగా క్వార్టర్లు నిరుపయోగంగా ఉన్నాయి. ఈ తరుణంలో మళ్లీ కొత్తగా నిర్మించాల్సిన అవసరమేంటనే ప్రశ్నలు క్వార్టర్ల నిర్మాణం ఆరంభించినప్పుడే ఉత్పన్నమయ్యాయి.
ఎగ్జిక్యూటివ్ కేడర్ పైనా దృష్టి సారించాలి..
క్వార్టర్లు నిర్మించే విషయంలో వెనువెంటనే నిర్ణయాలు తీసుకోవడం, టెండర్లు పిలవడం, గుత్తేదారుకు పనులు అప్పగించడంలో కనిపించిన వేగం ఆ తర్వాత వెంకటేష్‌ఖనిని ప్రారంభించడంలో కనిపంచలేదు. మూడేళ్లుగా ఈ ప్రాజెక్టు కాగితాలకే పరిమితమైంది. ఈ గనిలో పని చేసే కార్మికుల కోసమంటూ నిర్మిస్తున్న క్వార్టర్లు సైతం గడువు ముగిసినా ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. రూ.273 కోట్లతో చేపట్టే నిర్మాణ పనులకు సంబంధించి పంచాయతీ/కార్పొరేషన్ నుంచి అనుమతులు తీసుకోవడంలో నిర్లక్ష్యం, నిర్మాణ సామగ్రి కొనుగోలులో జాప్యం చేయడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పని ప్రదేశాల్లో భారీ యంత్రాలను సమర్థంగా వినియోగించుకోవడం, పని గంటల్లో వృథా సమయాన్ని తగ్గించడం వంటి అంశాలపై ఇటీవల సంస్థ దృష్టి పెట్టింది. ఉత్పాదక సామర్థ్యం విషయంలో కార్మికులపై దృష్టి పెట్టినట్టుగానే ఎగ్జిక్యూటివ్ కేడర్ విషయంలోనూ యాజమాన్యం దృష్టి సారించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
త్వరలో పూర్తవుతాయి
నిర్మాణ పనులకు అనుమతులు రావడం, మెటీరియల్ కొనుగోలు విషయంలో ఆలస్యమైంది. అందువల్ల నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోంది. ఈ ఏడాది చివరి నాటికి కొత్త క్వార్టర్లు అందుబాటులోకి వస్తాయి.
– డి.వెంకటేశ్వర్లు, జనరల్ మేనేజర్ (సివిల్)
సింగరేణి క్వార్టర్ల నిర్మాణ పనుల్లో జాప్యం
రూ.273 కోట్లతో పనులు చేపట్టిన యాజమాన్యం
ఏడాది క్రితమే గడువు ముగిసినా ఇంకా అసంపూర్తిగానే..
అధికారుల తీరుపై విమర్శలు, ఆరోపణలు
ఆది నుంచీ విమర్శలే
త్వరలో వెంకటేశ్‌ఖని(వీకే)–7 ఓపెన్ కాస్ట్ ప్రారంభం అవుతుందని, అందులో పని చేసే కార్మికుల కోసం కొత్తగా క్వార్టర్లు నిర్మిస్తున్నామని సింగరేణి అధికారులు తెలిపారు. నిబంధనల ప్రకారం గని ప్రారంభమైన తర్వాత మూడేళ్లపాటు అక్కడ ఉత్పత్తి జరిగి, ఆ పని ప్రదేశంలో బొగ్గు వెలికి తీయడం లాభసాటిగా ఉందని నిర్ధారణ జరిగాకే కార్మికుల నివాసాల కోసం క్వార్టర్లు నిర్మించాలి. కానీ కొత్తగూడెం ఏరియా, కార్పొరేట్ పరిధిలో క్వార్టర్ల విషయంలో డిజైన్లు ఖరారు చేయడం, టెండర్లు పిలవడం వంటి పనుల్లో అధికారులు ఆగమేఘాల మీద నిర్ణయాలు తీసుకున్నారు. కానీ భవనాల నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయించడంలో విఫలమవుతున్నారు.