
స్వర్ణ కవచధారణలో రామయ్య
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థాన అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచధారులై దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.
పెద్దమ్మతల్లికి
పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి శుక్రవారం వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి)ఆలయంలో అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్‌కు పంచామృతంతో అభిషేకం, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలు నిర్వహించారు. కుంకుమపూజ, గణపతిహోమం జరిపారు. ఈ కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, డైరెక్టర్ పాపారావు పాల్గొన్నారు.
శిశుగృహను
సజావుగా నడపాలి
భద్రాచలంఅర్బన్: శిశుగృహను సజావుగా నడపాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజేందర్ సూచించారు. భద్రాచలం బ్రిడ్జి సెంటర్‌లోని శిశుగృహను శుక్రవారం ఆయన సందర్శించారు. చిన్నారులకు అందుతున్న సేవలపై ఆరా తీసి, నిర్వాహకులకు సూచనలు చేశారు. అనంతరం భద్రాచలం సబ్ జైలులో తనిఖీలు చేపట్టారు. ఖైదీలకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. నిరుపేద ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం సబ్ జైల్ అధికారి ఉపేందర్, శిశుగృహ నిర్వాహకులు చంటి బాబు పాల్గొన్నారు.

స్వర్ణ కవచధారణలో రామయ్య

స్వర్ణ కవచధారణలో రామయ్య