
పేరు భద్రాచలం.. స్టేషన్ ఏపీలో!
● ఇటీవల భద్రాచలం–మల్కాన్‌గిరి రైల్వే లైన్‌ను ప్రకటించిన కేంద్రం ● స్థల సమస్యతో విలీన గ్రామంలో స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు ● ఆంధ్రప్రదేశ్ విలీన పంచాయతీలతో మరో సమస్య ఉత్పన్నం ● ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో కలిపితేనే శాశ్వత పరిష్కారం
భద్రాచలం: ఇటీవల కేంద్ర ప్రభుత్వం భద్రాచలం–మల్కాన్‌గిరి రైల్వే లైన్ ప్రకటించటంతో భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చే క్రమంలో భద్రాచలం రైల్వే స్టేషన్ నిర్మాణానికి గుర్తించిన గ్రామాలు విలీన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. ఆధ్యాత్మిక క్షేత్రమైన భద్రాచలం పేరు కేవలం రికార్డుల్లో నమోదు కాగా, స్టేషన్ మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో ఉండనుంది. భద్రాచలం నుంచి అక్కడి వరకు రోడ్డు మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటికే భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ జిల్లా కేంద్రంలో ఉంది. ఇలా జగత్‌ను ఏలే రారాజుగా కీర్తింపబడే జగదభి రామయ్య కొలువైన భద్రగిరిలో రైల్వే స్టేషన్ ఉండే పరిస్థితి లేకుండా పోయింది.
మల్కాన్‌గిరి–భద్రాచలం,
కొత్తగూడెం–కిరండోల్ వయా భద్రాచలం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలోని గిరిజన గ్రామాలను అనుసంధానం చేస్తూ మల్కాన్‌గిరి–భద్రాచలం రైల్వే లైన్ ప్రతిపాదించారు. 173 కిలోమీటర్ల మేర లైన్ నిర్మించాలని, పలు చోట్ల భారీ వంతెనలు, అండర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని ప్రణాళిక రూపొందించారు. ఒడిశాలోని జేపూర్ వరకు, అక్కడి నుంచి మల్కాన్‌గిరి, తిరిగి భద్రాచలం వరకు ఈ లైన్ ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. రైల్వేలైన్ నిర్మాణానికి తొలుత సుమారు రూ.2,800 కోట్లు, ఆ తర్వాత రూ.3,592 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఒడిశాలోని మల్కాన్‌గిరి, బదలి, కోవాసి గూడ, రాజన్‌గూడ, మహారాజ్ పల్లి, లూనిమన్‌గూడ స్టేషన్‌లు, ఆంధ్రప్రదేశ్‌ల్‌ని కన్నాపురం, కుట్టుగుట్ట, పల్లు, నందిగామ మీదుగా భద్రాచలంలోకి ప్రవేశించనుంది. ఈ నేపథ్యంలో భద్రాచలంలో స్థల సమస్యతో ఏపీలోని ఎటపాక, పిచుకులపాడు తదితర గ్రామాల వద్ద రైల్వే స్టేషన్ నిర్మించేలా అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అక్కడి నుంచి తెలంగాణలోని నదికి అవతలి వైపు పాండురంగాపురం వరకు గోదావరిపై రైల్వే బ్రిడ్జితో అనుసంధానం చేసే అవకాశం ఉంది. దీంతోపాటు తెలంగాణలోని కొత్తగూడెం– ఛత్తీస్‌గఢ్‌లోని కిరండోల్ వరకు 160.33 కిలో మీటర్ల ప్రతిపాదన సైతం ఉంది. దీనికి సైతం భద్రాచలం స్టేషన్‌తో పాటు గోదావరి బ్రిడ్జిపై రైల్వే వంతెనే కీలకం. ఇవి ఏర్పాటైతే దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి భద్రాచలానికి రైల్వే రవాణా, సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.
ఆ గ్రామాలను తెలంగాణలో కలపాలి
రాష్ట్ర విభజనతో ఇప్పటికే భద్రాచలానికి తీవ్ర నష్టం జరిగింది. విలీన గ్రామపంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలి. దీనివల్ల భద్రాచలం రైల్వే స్టేషన్ భద్రాచలంలోనే ఉంటుంది. ఆ దిశగా ప్రజాప్రతినిధులు ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలి.
–ఎస్‌కే షరీఫ్, స్థానికుడు
విలీన పంచాయతీలు వస్తే..
ప్రస్తుతం భద్రాచలం రైల్వే స్టేషన్ ప్రతిపాదిత గ్రామాలు ఉమ్మడి రాష్ట్రంలో భద్రాచలం గ్రామపంచాయతీ పరిధిలో ఉండేవి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజన క్రమంలో ఆ గ్రామాలను ఏపీలో కలిపారు. కన్నాయిగూడెం, పిచులకపాడు, గుండాల, పురుషోత్తపట్నం, ఎటపాక గ్రామపంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని అప్పటి నుంచి ఆ గ్రామాల ప్రజలు, భద్రాచలం ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని ఆ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలిపితే శాశ్వత పరిష్కారం లభిస్తుంది. దీంతో భద్రాచలం రైల్వే స్టేషన్ తెలంగాణలోనే ఉంటుంది. దేవస్థానం భూములపై ఆలయ వర్గాలకు, పురుషోత్తపట్నం గ్రామస్తుల నడుమ జరుగుతున్న గొడవలకు సైతం పుల్‌స్టాప్ పడే అవకాశం ఉంది.

పేరు భద్రాచలం.. స్టేషన్ ఏపీలో!