
ఉద్యాన సాగుకు ప్రోత్సాహం
● పండ్ల తోటల పెంపకానికి భారీగా రాయితీలు ● ఎంఐడీహెచ్ పథకం ద్వారా మూడేళ్లపాటు వర్తింపు
హెక్టారుకు రాయితీ వివరాలిలా (రూ.లలో)
పంట 2024–25 2025–26
మామిడి 16,400 50,000
బొప్పాయి 30,000 30,000
అరటి 40,985 70,000
జామ 29,332 50,000
కోకో 22,000 30,000
డ్రాగన్ ఫ్రూట్ 1,60,000 2,70,000
మల్చింగ్ 16,000 20,000
సూపర్‌బజార్(కొత్తగూడెం)/బూర్గంపాడు: ఉద్యాన పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. పండ్ల తోటల పెంపకానికి భారీగా రాయితీలు పెంచింది. క్రమంగా తోటల విస్తీర్ణం తగ్గుతుండగా, రైతులకు చేయూతనందించేదుకు చర్యలు చేపట్టింది. జిల్లాలో 1,69,700 ఎకరాల్లో ఉద్యానవన పంటలు సాగవుతున్నాయి. ఇందులో ఆయిల్‌పామ్‌దే అగ్రస్థానం. 75 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగవుతుండగా, ప్రభుత్వం రాయితీ, గిట్టుబాటు ధరలతో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ఇదే తరుణంలో మామిడి, జీడిమామిడి, అరటి తోటల సాగు తగ్గుతోంది. ప్రస్తుతం జిల్లాలో 7,512 ఎకరాల్లో మామిడి, 12,069 ఎకరాల్లో జీడిమామిడి సాగవుతోంది. 1,756 ఎకరాలలో కొబ్బరి, కోకో 657 ఎకరాల్లో, 12 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ తోటలు సాగవుతున్నాయి. ఉద్యాన పంటల్లో 23 వేల ఎకరాల్లో మిర్చి, 10 వేల ఎకరాల్లో కూరగాయలు సాగవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో రైతులు పండ్ల తోటలను తొలగించి ఆయిల్‌పామ్ సాగు చేపట్టారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ పండ్ల తోటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం భారీగా రాయితీలను ప్రకటించింది.
అత్యధికంగా డ్రాగన్ ఫ్రూట్‌కు..
ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న మిషన్ ఇంటిగ్రేటేడ్ డెవలప్‌మెంట్ హార్టికల్చర్(ఎంఐడీహె చ్) పథకం ద్వారా పండ్ల తోటలకు ప్రభుత్వం రాయితీలు ప్రకటించింది. గతేడాది డ్రాగన్ ఫ్రూట్‌కు హెక్టారుకు రూ.1,60,000 రాయితీనివ్వగా ఈ ఏడాది రూ. 2,70,000కు పెంచింది. బొప్పాయి సాగుకు మాత్రం గతేడాది ఇచ్చిన రూ.30 వేల రాయితీని కొనసాగిస్తోంది. మిర్చి, కూరగాయల సాగులో వాడుకునే మల్చింగ్‌కు గతేడాది రూ.16వేల రాయితీనివ్వగా ఈ ఏడాది రూ.20వేలకు పెంచింది. మూడేళ్లపాటు ఇదే రాయితీలను కొనసాగించనుంది.
పండ్ల తోటల సాగు లాభదాయకం
ఉద్యాన పంటలకు మార్కెట్‌లో డిమాండ్ ఉంది. ప్రభుత్వం కూడా రాయితీలు పెంచింది. జిల్లాలో భూములు పండ్ల తోటల పెంపకానికి అనువుగా ఉన్నాయి. సంప్రదాయ పంటల కంటే తోటల సాగు లాభదాయకంగా ఉంటుంది. ఆసక్తి కలిగిన రైతులు హార్టికల్చర్ అధికారులను కలిసి దరఖాస్తు చేసుకోవాలి. –జంగా కిషోర్,
జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖాధికారి

ఉద్యాన సాగుకు ప్రోత్సాహం

ఉద్యాన సాగుకు ప్రోత్సాహం

ఉద్యాన సాగుకు ప్రోత్సాహం

ఉద్యాన సాగుకు ప్రోత్సాహం

ఉద్యాన సాగుకు ప్రోత్సాహం

ఉద్యాన సాగుకు ప్రోత్సాహం