కొరవడుతున్న పర్యవేక్షణ | - | Sakshi
Sakshi News home page

కొరవడుతున్న పర్యవేక్షణ

Jul 15 2025 6:33 AM | Updated on Jul 15 2025 6:33 AM

కొరవడ

కొరవడుతున్న పర్యవేక్షణ

పాల్వంచరూరల్‌ : దేవాలయాల్లో భక్తుల సౌకర్యాలు, ఆలయ ఆస్తుల పరిరక్షణ, సిబ్బంది పనితీరుపై పర్యవేక్షణ చేయాల్సిన ఈఓ పోస్టులు ఖాళీగా ఉండడంతో ఇక్కట్లు తప్పడం లేదు. ఉమ్మడి జిల్లాలోని అనేక ఆలయాల్లో ఈ సమస్య వేధిస్తోంది. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో కలిపి మొత్తం 600 ఆలయాలు ఉండగా, ఇందులో ఏడాదికి రూ.2లక్షలు, ఆపైన ఆదాయం వచ్చే ఆలయాలు 92 ఉన్నాయి. ఈ దేవాలయాలకు సంబంధించి 18 ఈఓ పోస్టులు కేటాయించారు. అంటే ఒక్కో ఈఓ సుమారు ఐదు ఆలయాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. కానీ ఈ 18లో కూడా ప్రస్తుతం 11 మంది మాత్రమే విధుల్లో ఉండగా ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఉన్నవారిపై అదనపు భారం పడడమే కాక భక్తులకు కనీస సౌకర్యాలు అందడం లేదు.

పెద్ద ఆలయాలకూ దిక్కు లేదు..

ఉమ్మడి జిల్లాలో నిత్యం భక్తుల రద్దీ ఉండే పలు ఆలయాలకు కూడా రెగ్యులర్‌ ఈఓలు లేరు. జిల్లాలోని అన్నపురెడ్డిపల్లి శ్రీ బాలాజీ వేంకటేశ్వరస్వామి ఆలయం, కొత్తగూడెంలోని విజయ విఘ్నేశ్వరస్వామి, పాల్వంచలోని పెద్దమ్మతల్లి, భద్రాచలంలోని అభయాంజనేయస్వామి ఆలయాల్లో ఇన్‌చార్జ్‌ ఈఓలే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక ఖమ్మం జిల్లాలో జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి, ఖమ్మం కమాన్‌బజార్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయం, ఖమ్మం రూరల్‌ మండలంలోని మారెమ్మగుడి వంటి పెద్ద ఆలయాలకు కూడా రెగ్యులర్‌ ఈఓలు లేరు. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 11 మంది ఈఓలు ఉండగా, వారికి కేటాయించిన ఆలయాలతో పాటు ఆదాయం తక్కువగా ఉన్న ఇతర దేవాలయాల పర్యవేక్షణ బాధ్యతలు కూడా వీరిపైనే పడుతున్నాయి.

ఒకరు.. 17 ఆయాలు..

పలువురు ఈఓలు ఎక్కువ సంఖ్యలో ఆలయాలకు ఇన్‌చార్జ్‌లుగా ఉండడంతో పర్యవేక్షణ కొరవడుతోంది. కొత్తగూడెంలోని దాసాంజనేయస్వామి ఆలయ ఈఓ శేషయ్య 17 దేవస్థానాలకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇందులో జిల్లాలో ఏడు ఆలయాలు ఉండగా ఖమ్మం జిల్లాలో పది ఉన్నాయి. పెద్దమ్మగుడి ఆలయ ఈఓ రజినీకుమారి ఇక్కడే ఇన్‌చార్జ్‌గా ఉండగా, ఈ దేవస్థానంతో పాటు పాల్వంచలోని భజన మందిరం, పాత పాల్వంచలోని వేంకటేశ్వరస్వామి ఆలయం, కొత్తగూడెంలోని విఘ్నేశ్వరస్వామి ఆలయం, ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని నీలాద్రీశ్వరస్వామి ఆలయాల బాధ్యతలు కూడా చూస్తున్నారు. ఖమ్మంలోని ప్రసిద్ధ శ్రీ స్తంభాద్రి లక్ష్మీనృసింహస్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి కొత్తూరు జగన్మోహన్‌రావు జమలాపురం, జీళ్లచెరువులోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాలతో పాటు మారెమ్మగుడికి కూడా ఇన్‌చార్జ్‌ ఈఓగా వ్యవహరిస్తున్నారు. ఇలా ఒకటికి మించి ఆలయాల పర్యవేక్షణ బాధ్యతలతో వారు ఎక్కడా పూర్తిస్థాయిలో పని చేయలేకపోతున్నారు. దీంతో ఆలయాల్లో కనీస సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారు. కనీసం ఉమ్మడి జిల్లాకు కేటాయించిన 18 పోస్టుల్లో ఖాళీగా ఉన్న ఏడు భర్తీ చేయడంతో పాటు అధిక ఆదాయం ఉన్న ఆలయాలకు ప్రత్యేకంగా ఈఓలను నియమించాలని భక్తులు కోరుతున్నారు.

పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు

ఉమ్మడి జిల్లాలోఽ 600 ఆలయాలు ఉండగా ధూప, దీప నైవేద్యం పథకంలో 462 దేవాలయాలు ఉన్నాయి. ఇందులో ఏడాదికి రూ.2లక్షలకు పైగా ఆదాయం ఉన్న ఆలయాలు 92 ఉండగా మొత్తం 18 ఈఓ పోస్టులున్నాయి. ఇందులో ఏడు పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఇందుకోసం దేవాదాయ శాఖ కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపించాం. ఏడుగురిని నియమించగానే ఆయా ఆలయాలకు కేటాయిస్తాం.

– వీరస్వామి, ఎండోమెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌

ఉమ్మడి జిల్లాలో 600 పైగా ఆలయాలు

ఏడాదికి రూ. 2లక్షలకు పైగా ఆదాయం వచ్చేవి 92..

ఈ దేవస్థానాల్లో 18 ఈఓ పోస్టులు.. ఉన్నది 11 మందే

ఇన్‌చార్జ్‌లతో భక్తులకు తప్పని ఇక్కట్లు

అన్యాక్రాంతమవుతున్న ఆలయ భూములు..

ఉమ్మడి జిల్లాలో దేవాదాయ శాఖ పరిధిలో మొత్తం 14,771 ఎకరాల భూములు ఉన్నాయని రికార్డులు చెబుతున్నాయి. ఇందులో ఖమ్మం జిల్లాలో 4,865 ఎకరాలు ఉండగా 862 ఎకరాలు అన్యాక్రాంతమైంది. భద్రాద్రి జిల్లాలో 9,906 ఎకరాలకు గాను 1,039 ఎకరాల భూమి ఆక్రమణకు గురైంది. వాటిని స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నా.. ఆయా ఆలయాలకు ప్రత్యేకంగా ఈఓలు లేకపోవడంతో సరైన పర్యవేక్షణ ఉండడం లేదు.

కొరవడుతున్న పర్యవేక్షణ1
1/1

కొరవడుతున్న పర్యవేక్షణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement