నాడు గండ్లు.. నేడు లీకులు | - | Sakshi
Sakshi News home page

నాడు గండ్లు.. నేడు లీకులు

Jul 15 2025 6:55 AM | Updated on Jul 15 2025 6:55 AM

నాడు

నాడు గండ్లు.. నేడు లీకులు

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సీతారామ ప్రాజెక్టులో 1 నుంచి 8 ప్యాకేజీల్లో భాగంగా రూ. 6,714 కోట్ల వ్యయంతో 104.4 కి.మీ. పొడవైన ప్రధాన కాల్వ నిర్మించారు. దీని నీటి ప్రవాహ సామర్థ్యం 9వేల క్యూసెక్కులు. ఈ కాల్వ పొడవునా కిన్నెరసాని, ముర్రేడు వంటి నదులు, వాగులతో పాటు చిన్నచిన్న ఒర్రెల వంటి నీటి ప్రవాహాలు ఎదురైన చోట అక్విడెక్ట్‌లు, గైడ్‌వాళ్లు, సూపర్‌ ప్యాసేజ్‌లు నిర్మించారు. 2018లో పనులు ప్రారంభించగా 2022 చివరి నాటికి మూడు పంప్‌హౌస్‌లు, ప్రధాన కాల్వల నిర్మాణం పూర్తయింది. గతేడాది ఆగస్టు, ఈ ఏడాది మార్చిలో రెండు సార్లు గోదావరి నీరు ఈ కాల్వ ద్వారా ప్రవహించింది. మూడో విడతగా ఇటీవల నీటిని ఎత్తిపోశారు. అయితే గోదావరి నుంచి కృష్ణా ఆయకట్టుకు నీటిని తరలించే క్రమంలో ముర్రేడు వాగుపై నిర్మించిన అక్విడెక్ట్‌ (నీటి ప్రవాహాలు వెళ్లేందుకు నిర్మించే వంతెన)కు పలు చోట్ల లీకేజీలు బయటపడ్టాయి. అలాగే అక్విడెక్ట్‌ ముందు భాగంలోని గైడ్‌వాళ్ల నుంచి కూడా నీరు లీకవుతోంది. గత శనివారం మధ్యాహ్నం అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద గల పంప్‌హౌస్‌ నుంచి ఒక మోటారు ద్వారా ఎత్తిపోతలు ప్రారంభించారు. ఇక్కడి నుంచి రెండు, మూడు పంప్‌హౌస్‌లకు నీటి ప్రవాహ క్రమంలో ఆదివారం రాత్రి నుంచి ప్రధాన కాల్వలో లీకేజీలు బయటపడుతున్నాయి. దీంతో గైడ్‌వాల్‌ పక్కన గల అప్రోచ్‌ రోడ్‌ బురదమయంగా మారుతోంది.

ముందే బయపడిన గండ్లు..

సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన పంప్‌హౌస్‌ల ద్వారా గత ఖరీఫ్‌ సీజన్‌లో తొలిసారి నీళ్లు ఎత్తిపోశారు. అయితే ఈ కార్యక్రమానికి ముందే మొదటి రెండు పంప్‌హౌస్‌ల మధ్య ప్రధాన కాల్వకు రెండు, మూడు చోట్ల గండి పడిన విషయం వెలుగుచూసింది. గతేడాది ఆగస్టు 15న మోటార్లు ఆన్‌ చేసి తొలిసారిగా నీరు ఎత్తిపోయగా.. రెండు వారాలు గడవకముందే మొయిన్‌ కెనాల్‌కు పాల్వంచ, చండ్రుగొండ మండలాల్లో రెండు చోట్ల గండ్లు పడ్డాయి. భారీ వర్షాలకు వరద నీరు ప్రధాన కాల్వలో పెరిగిపోవడంతో నీటి ఒత్తిడి పెరిగి గండ్లు పడ్డాయని ఇంజనీర్లు వివరణ ఇచ్చారు. దీంతో ప్రధాన కాల్వపై వరద నీటి ఒత్తిడి తగ్గించేందుకు రూ.60 కోట్లతో ఎస్కేప్‌ చానల్‌ నిర్మించాలని నిర్ణయించారు. ప్రధాన కాల్వకు వరుసగా పడుతున్న గండ్లు, కుంగిపోతున్న కాంక్రీట్‌ నిర్మాణాలు, లీకులకు నిలయంగా మారిన గైడ్‌వాళ్లు ‘సీతారామ’ పనుల నాణ్యతపై సందేహాలకు తావిస్తున్నాయి.

లీకేజీలు గుర్తిస్తున్నాం

ప్రధాన కాల్వకు ఎన్ని చోట్ల లీకేజీలు ఉన్నాయనేదాన్ని గుర్తిస్తున్నాం. ప్రస్తుతం జరుగుతున్న ఎత్తిపోతల పని పూర్తి కాగానే లీకేజీలు ఉన్న చోట మరమ్మతులు చేపడతాం. ప్రధాన కాల్వ నిర్మాణ పనులు (గైడ్‌వాల్స్‌, అక్విడెక్ట్‌లు) చేపట్టిన సంస్థనే లీకేజీలకు మరమ్మతులు చేయాల్సి ఉంటుంది.

– శ్రీనివాసరెడ్డి, సీతారామ ప్రాజెక్ట్‌ ఎస్‌ఈ

‘సీతారామ’లో మొదలైన గోదావరి జలాల ఎత్తిపోతలు

లిఫ్ట్‌ చేసిన రెండో రోజే ప్రధాన కాల్వ నుంచి లీకేజీలు

తొలిసారి ఎత్తిపోసినప్పుడు మెయిన్‌ కెనాల్‌కు గండ్లు

నిర్మాణ పనుల్లో నాణ్యతపై సందేహాలు ?

నాడు గండ్లు.. నేడు లీకులు1
1/1

నాడు గండ్లు.. నేడు లీకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement