
మేకపాలు శ్రేష్ఠం
కలెక్టర్ జితేష్ వి పాటిల్
కొత్తగూడెంఅర్బన్/సూపర్‌బజార్(కొత్తగూడెం): గేదెల పాల కంటే మేకపాలు ఎంతో శ్రేష్ఠమైనవని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కొత్తగూడెంలోని ఫుడ్ కోర్టులోని మహిళా శక్తి క్యాంటిన్ ఇటీవల ఆయన మేకపాల కేంద్రాన్ని ఏర్పాటు చేయించారు. కాగా, ఆ కేంద్రాన్ని సోమవారం సందర్శించిన కలెక్టర్.. మహిళలు అందించిన మేకపాలు తాగారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రస్తుతం మార్కెట్‌లో గేదె, ఆవు పాల ధర లీటర్‌కు రూ. 80 వరకు ఉందని, మేకపాలు కూడా అదే ధరకు విక్రయించొచ్చని అన్నారు. జిల్లాలో రెండు లక్షల మేకలు ఉన్నాయని, రైతులు వాటి పాల విక్రయం ద్వారా నెలకు రూ.3 నుంచి రూ.4వేల వరకు ఆదాయం గడించవచ్చన్నారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు తప్పనిసరిగా మేకపాలు తాగించాలని తల్లిదండ్రులను కోరారు. నగరాల్లో మేకపాలతో పన్నీరు, చీజ్ వంటివి తయారు చేసి ఆర్థికాభివృద్ధి చెందుతున్నారని, జిల్లా రైతులు కూడా దీనిపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పశువైద్యాధికారి వెంకటేశ్వర్లు, డాక్టర్లు ఆనందరావు, బాలకృష్ణ, రామకృష్ణ, సంతోష్, గోపాలమిత్ర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
బయోచార్ తయారీ పరిశీలన..
చుంచుపల్లి: మండలంలోని విద్యానగర్ గ్రామపంచాయతీ డంపింగ్ యార్డ్‌లో మట్టి, ఇటుకలతో నిర్మించిన కోన్‌టిక్ కొలిమిలో ఎండిన సర్కారు తుమ్మ చెట్ల కొమ్మలను కాల్చి బయోచార్(జీవ బొగ్గు) తయారీ విధానాన్ని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సోమవారం పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ బయోచార్‌ను గోమూత్రం, గోవు పేడలో కొన్ని రోజులు నిల్వ చేసి, ఆరిన తర్వాత పొడిచేసి పంటలకు సేంద్రియ ఎరువుగా వాడితే భూసారం అభివృద్ధి చెందుతుందని, అధిక దిగుబడులు వస్తాయని వివరించారు. పంచాయతీ సబ్బంది, కార్మికులు గృహాలు, షాపుల నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరిచాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సుభాషిని, డీఎల్పీఓ ప్రభాకర్ రావు, ఎంపీఓ సత్యనారాయణ, సిబ్బంది రాజు, రాజేశ్వరి, మమత, సెక్రటరీ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.