
ముత్తంగి అలంకరణలో రామయ్య
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విష్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఉత్తమ అవార్డు దరఖాస్తులకు
గడువు పెంపు
కొత్తగూడెంఅర్బన్: జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు దరఖాస్తుల గడువు ఈనెల 17వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.వెంకటేశ్వరా చారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని జెడ్పీ, ప్రభుత్వ, ఏఈఈఎస్, ఏకలవ్య పాఠశాలల్లో పని చేస్తున్న అర్హులైన ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని, అప్‌లోడ్ చేసిన వివరాల ధృవపత్రాలను అదే రోజు విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.
స్వయం ఉపాధి రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం
కొత్తగూడెంటౌన్: దివ్యాంగుల ఆర్థిక ప్రోత్సాహక పథకం కింద జిల్లాలోని దివ్యాంగులకు స్వయం ఉపాధి పథకాల ఏర్పాటుకు అవసరమైన రుణాలు ఇస్తామని జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనీనా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 100 శాతం రాయితీతో రూ.50 వేల చొప్పున 27 యూనిట్లు, 80 శాతం రాయితీతో రూ.లక్ష యూనిట్ ఒకటి, 60 శాతంతో రూ.3 లక్షల యూనిట్ ఒకటి ఇస్తామని పేర్కొన్నారు. అర్హులైన దివ్యాంగులు ఈనెల 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు 63019 81960 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
వైద్యులకు సన్మానం
భద్రాచలంటౌన్: భద్రాచలం ఏరియా ఆస్పత్రి వైద్యులు ఇటీవల ఓ మహిళకు ల్యాప్రోస్కోపిక్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. దీంతో ఐటీడీఏ పీఓ బి.రాహుల్ వైద్యులను సోమవారం అభినందించడంతో పాటు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ.. గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉండడంతో రూ.2 లక్షలు ఖర్చయ్యే శస్త్రచికిత్సను వైద్యశాల సూపరింటెండెంట్ రామకృష్ణ రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా తొలిసారి లాప్రోస్కోపిక్ పద్ధతిలో శస్త్రచికిత్స నిర్వహించారని, మారుమూల ఆదివాసీ గ్రామాల ప్రజలు సరైన అవగాహన లేక ఇలాంటి వ్యాధులతో ఇబ్బందులు పడుతుంటారని, వైద్య సిబ్బంది వారిని గుర్తించి వైద్య సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఎంహెచ్‌ఓ డాక్టర్ చైతన్య, ఏరియా ఆస్పత్రి సూపరిటెండెంట్ రామకృష్ణ, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ వెంకటరాజ్, డాక్టర్ నిఖిత తదితరులు పాల్గొన్నారు.
మిర్చి ధర ముందడుగు..
ఖమ్మంవ్యవసాయం: మిర్చి ధరలో స్వల్పంగా ఎదుగుదల నమోదైంది. కొంతకాలంగా ధరలతో పోలిస్తే ప్రస్తుతం రూ.350 నుంచి రూ.500 మేర పెరుగుదల కనిపిస్తోంది. ఫిబ్రవరిలో మిర్చి క్వింటాకు రూ.14 వేల నుంచి రూ.14,500 వరకు పలికిన ధర మార్చి ఆరంభం నుంచి రూ.14 వేల లోపుకు పడిపోయింది. మార్చి, ఏప్రిల్‌లో రూ.13,500 నుంచి రూ.13,850 మధ్యే పలకగా మే నెలలోనైతే రూ.13 వేలు దాటలేదు. జూన్ ఆరంభంలో ఏసీ మిర్చికి రూ.14,200 వరకు ధర వచ్చినా ఆతర్వాత రూ.13 వేలకు పడిపోవడంతో ఈ నెలారంభం నుంచి పురోగతి కనిపించింది. ఈనెల మొదటి వారంలో ఏసీ మిర్చి(తేజా రకం) ధర రూ.13,350 నుంచి పెరుగుతూ 11వ తేదీకి రూ.13,500కు చేరింది. ఇక సోమవారం మరో రూ.350 పెరిగి రూ.13,850కు చేరడం విశేషం. నాన్ ఏసీ మిర్చి విషయానికొస్తే జూన్‌లో రూ.12,500 లోపే ధర పలకగా, ఈనెలారంభం నుంచి పుంజుకుంటూ సోమవారం రూ.13,600కు చేరింది.

ముత్తంగి అలంకరణలో రామయ్య