
‘సంక్షేమం’తో ఆర్థికాభివృద్ధి సాధించాలి
గిరిజన దర్బార్‌లో ఐటీడీఏ పీఓ రాహుల్
భద్రాచలం : ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ గిరిజనులు ఆర్థికాభివృద్ధి సాధించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన దర్బార్‌లో గిరిజనుల నుంచి వినతులు స్వీకరించారు. ఆయ దరఖాస్తులను యూనిట్ అధికారులకు అందించి వీలైనంత త్వరగా పరిష్కరించాలని సూచించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అర్హులైన గిరిజనులకు చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ములకలపల్లి మండలం రామవరం, మూకమామిడి గ్రామస్తులు పోడు భూముల సర్వే, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల యూనిఫామ్ తయారీకి అనుమతి ఇవ్వాలని వినతులు సమర్పించారు. లక్ష్మీదేవిపల్లి మండలం ఆళ్లగండి గ్రామానికి చెందిన శివాని బీటీ రోడ్డు నిర్మించాలని, గుండాల మండలం పాలగూడెం గ్రామానికి చెందిన సాత్విక ఈఎంఆర్‌ఎస్ పాఠశాలలో ఏడో తరగతిలో సీటు ఇప్పించాలని, కామేపల్లి మండలం తోగ్గూడెం గ్రామానికి చెందిన భీమ్ చంద్ సీఆర్టీ ఉద్యోగం ఇప్పించాలని, దుమ్ముగూడెం మండలం బండ్లగూడ గ్రామానికి చెందిన ముదిరాజు ఆశ్రమ పాఠశాలల్లో వంట మనిషిగా పనిచేసే అవకాశం కల్పించాలని ఆర్జీలు ఇచ్చారు. వాటిని ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేసి విడతల వారీగా అర్హులందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తామని పీఓ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్, ఏఓ సున్నం రాంబాబు, ఎస్‌ఓ భాస్కర్‌రావు, ఉద్యానవనాధికారి ఉదయ్‌కుమార్, కొండరెడ్ల అధికారి రాజారావు, ఆర్‌ఓఎఫ్‌ఆర్ డీటీ లక్ష్మీనారాయణ, ఏపీఓ(పవర్) వేణు, ఐడీసీఎస్ సూపర్‌వైజర్ అనసూయ, మేనేజర్ ఆదినారాయణ, జేడీఎం హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.