
మార్కెట్ కార్మికుల చార్జీలు పెంపు
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో పనిచేసే కార్మికుల చార్జీలు 13 శాతం పెరిగాయి. రెండేళ్లకు ఒకసారి మార్కెట్ కార్మికుల రేట్ల పెంపుపై నూతన ఒప్పందం ఉంటుంది. కార్మిక సంఘాల ప్రతినిధులు పెరిగిన నిత్యావసరాలు, ఇతర అవసరాలకు అనుగుణంగా తమకు రేట్లు పెంచాలని ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి వర్గానికి, ఖమ్మం మార్కెట్ కమిటీకి నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసుల ఆధారంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ, చాంబర్ ఆఫ్ కామర్స్, రైతు సంఘాల ప్రతినిధులు, కార్మిక సంఘాల ప్రతినిధులతో రెండుసార్లు సమావేశాలు నిర్వహించారు. ఈ ఏడాది మిర్చి ధర తగ్గినందున కార్మికుల రేట్ల పెంపును విరమించుకోవాలని రైతు సంఘాలు ప్రతిపాదించాయి. ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని కార్మికులు అభ్యర్థించిన రేట్ల పంపును పరిశీలించి 13 శాతం పెంచుతున్నట్లు నిర్ణయించారు. మార్కెట్‌లో హమాలీలు, దడవాయిలు, స్వీపర్లు, రెల్లుడు వంటి కార్మిక విభాగాలు పనిచేస్తాయి. ఆయా కార్మికులుకు గతంలో నిర్ణయించిన రేట్లపై 13 శాతాన్ని పెంచారు. పత్తి, పంటలు బోరాల్లో నింపితే అదనంగా చార్జి చెల్లించాల్సి ఉంటుంది. గింజలు పెట్టడం, ధాన ధర్మాలు(ముష్టి) వంటి విధానాలు పూర్తిగా నిషేధించారు. ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ దిగుమతి శాఖ పర్యవేక్షణలో ఈ నూతన రేట్లు అమలు కానున్నాయి. రైతుల పంటను ఖరీదుదారులకు విక్రయించటంలో మధ్యవర్తులుగా వ్యవహరించే కమీషన్‌దారులు నూతన కార్మికుల రేట్లు అమలు చేయాల్సి ఉంటుంది. పెంచిన 13 శాతం రేట్లు మార్కెట్‌లో పనిచేసే సుమారు 2,500 మంది కార్మికులకు వర్తించే అవకాశం ఉంది.
ఈ నెల 22 నుంచి 13 శాతం పెంపు అమలు