
తగ్గిన పశు సంపద
● గత డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు పశుగణన ● ఐదేళ్ల క్రితం సర్వే ప్రకారం జిల్లాలో 4.55 లక్షలు ● ఇటీవలి గణనలో తక్కువ ఉన్నట్లు తేలడంతో రీసర్వే
పాల్వచరూరల్: ఐదేళ్లకోసారి నిర్వహించే జాతీయ పశుగణన ప్రక్రియ జిల్లాలో గత నెలలో ముగిసింది. తెల్ల పశువులు, గెదేలు, గొర్రెలు, మేకల సంఖ్య తగ్గిపోయినట్లు సర్వేలో వెల్లడైంది. దీంతో పశువులు ఎందుకు తగ్గాయి.? అందుకు గల కారణాలు, పరిస్థితులు తెలపాలంటూ కేంద్ర ప్రభుత్వం రీ సర్వేకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 1 నుంచి పదిరోజులపాటు జిల్లాలో పది మండలాల్లో పశుసంవర్థక శాఖ అధికారులు రీ సర్వే నిర్వహించారు.
గత డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు..
జాతీయస్థాయిలో ఐదేళ్లకోసారి పశుగణన నిర్వహిస్తుండగా చివరిసారిగా 2018–19 సంవత్సరంలో గణించారు. ఇప్పటివరకు 20 సార్లు పశుగణన చేపట్టారు. తాజాగా గతేడాది డిసెంబర్ 25 నుంచి ఏప్రిల్ వరకు పశుగణన సర్వే నిర్వహించారు. వివరాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేశారు. జిల్లాలోని 23 మండలాల పరిధిలో 473 రెవెన్యూ గ్రామాల్లో 140మంది ఎన్యూమరేటర్లు, 30 మంది సూపర్‌వైజర్లు 2,91,273 నివాసాల్లో పశుగణన చేపట్టారు. గతంలో కంటే పశుసంపద బాగా తగ్గిందని సర్వేలో తేలింది.
35 శాతం వరకు తగ్గిన తెల్ల, నల్ల పశువులు
2018–2019లో సర్వే ప్రకారం జిల్లాలో 4.55 లక్షల పశువులు ఉన్నాయి. ఇందులో తెల్లపశువులు 2.80లక్షలు, నల్లపశువులు (గేదెలు) 1.70లక్షలు, మేకలు 2.50లక్షలు, గొర్రెలు 2.60 లక్షలు ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. కోళ్లు 3.27లక్షలు, నాటుకోళ్లు 1.38 లక్షలు, పందులు 3,180, కుక్కలు 30 వేలు ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. కానీ తాజా సర్వేలో తెల్లపశువులు 35–40శాతం, గేదెలు 30–35శాతం, గొర్రెలు 20–25శాతం, మేకలు 30శాతం, పెరటి కోళ్లు 35–40 శాతం తగ్గినట్లు తేలింది.
ఎందుకు తగ్గాయంటే..?
పశువుల సంఖ్య తగ్గడానికి కారణాలను కూడా విశ్లేషించారు. పోషణభారం కావడంతోపాటు పశువులను మేపే వారు తగ్గిపోవడం, బీడు భూములు లేకపోవడం, అటవీశాఖ అధికారులు ఫారెస్ట్‌లోకి పశువులు, మేకలు, గొర్రెలను రానివ్వకపోవడం, వ్యవసాయంలో యంత్రపరికరాల వినియోగం పెరగడం, ఇరిగేషన్ భూములు తగ్గిపోవడం వంటి కారణాల వల్ల పశువుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లుగా రీ సర్వేలో తేలింది.
పశువుల సంతతి తగ్గింది
జిల్లాలో 21వ జాతీయ పశుగణన ప్రక్రియ నిర్వహించారు. 20వ సర్వేలో తేలిన పశువుల సంఖ్య కంటే తాజా సర్వేలో తక్కువ సంఖ్యలో పశువులు ఉన్నట్లు తేలింది. కేంద్రం ఆదేశాలతో పాల్వంచ, చండ్రుగొండ, బూర్గంపాడు, అన్నపురెడ్డిపల్లి, అశ్వాపురం, కరకగూడెం, ములకలపల్లి, పినపాక, మణుగూరు, ఇల్లెందు మండలాల పరిధిలో రీ సర్వే నిర్వహించాం. వివరాలను పశుగణ్ యాప్‌లో ఆన్‌లైన్ చేస్తున్నాం.
– డాక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా పశువైద్యాధికారి

తగ్గిన పశు సంపద

తగ్గిన పశు సంపద