
భక్తులతో పోటెత్తిన భద్రగిరి
భద్రాచలం: భద్రగిరి ఆదివారం భక్తులతో పోటెత్తింది. రెండో శనివారం, ఆదివారం వరుస సెలవులు రావడంతో భక్తులు భద్రాచలం బాట పట్టారు. పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి క్యూలైన్లలో బారులుదీరి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి నిత్యకల్యాణం, అభిషేకం తదితర పూజా కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రద్దీ ఉండటంతో పట్టణంలో ప్రైవేట్ లాడ్జీలలో, దేవస్థానం వసతి గృహాల్లో గదులు దొరకక భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.
రామయ్యకు వైభవంగా కల్యాణం
అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామివారిని పల్లకీ సేవగా చిత్రకూట మండపానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత అర్చకులు స్వామివార్లకు విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.
శ్రీసీతారామచంద్ర స్వామివారికి
అభిషేకం, సువర్ణ పుష్పార్చన
స్వామివారి సేవలో ఎస్పీ
శ్రీ సీతారామ చంద్రస్వామివారిని ఎస్పీ రోహిత్ రాజు, మౌనిక దంపతులు దర్శించుకున్నారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం అంతరాలయంలో మూలమూర్తులను దర్శించుకుని పూజలు చేశారు. శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారి ఉపాలయంలో పండితులు వేదాశీర్వచనం చేశారు. ప్రసాదాలను అందజేశారు.

భక్తులతో పోటెత్తిన భద్రగిరి