
3,500 ఇన్.. 3,390 అవుట్
● ఇటీవల కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేసిన ప్రభుత్వం ● బియ్యం తీసుకోని, ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నవారివి రద్దు ● ఆందోళన చెందుతున్న రద్దయిన రేషన్‌కార్డుదారులు
కొత్తగూడెంఅర్బన్: అర్హులకు రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు సర్వే నిర్వహించి కొందరి రేషన్ కార్డులను ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో రద్దైన లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం గత మార్చి నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో బియ్యం తీసుకోనివారు కూడా రేషన్ షాపుల వద్దకు వచ్చి క్యూలో నిలబడి బియ్యం తీసుకెళ్తున్నారు. సన్నబియ్యం పంపిణీ చేస్తున్నా ఇంకా కొందరు రేషన్ బియ్యం తీసుకోనివారు ఉన్నారు. ఫలితంగా రేషన్ షాపులో బియ్యం మిగిలి, బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్నాయి. దీనికి చెక్ పెట్టేందుకు సివిల్ సప్లయీస్ అధికారులు రెవెన్యూ శాఖ సహకారంతో సర్వే నిర్వహించారు. చాలా మంది రేషన్‌కార్డులు కలిగి ఉండి, బియ్యం తీసుకోవడం లేదని సర్వేలో తేలింది. ఈ నేపథ్యంలో ఆరు నెలలుగా రేషన్‌బియ్యం తీసుకోనివారు, ఇక్కడ రేషన్ కార్డు కలిగి ఉండి ఇతర రాష్ట్రాల్లో నివాసం ఉంటున్న వారి పేర్లను సేకరించారు. ఇలా జిల్లాలో 3,390 రేషన్ కార్డులను, 5,401 మంది లబ్ధిదారుల పేర్లను తొలగించారు. మరో 78 కార్డులకు సంబంధించిన సర్వే ప్రక్రియ సాగుతోంది.
మరో 6,459 కార్డులు పంపిణీకి సిద్ధం
జిల్లాలో రేషన్‌కార్డు దరఖాస్తులపై సర్వే పూర్తి చేసి దాదాపు 3,500 కొత్త కార్డులను సివిల్ సప్లై అధికారులు మంజూరు చేశారు. వారందరికీ రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇంకా 6,459 కార్డులను అప్రూవల్ చేసి పంపిణీకి సిద్ధం చేశారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నుంచి అనుమతి ఇస్తే ఆ కార్డులను కూడా పంపిణీ చేయనున్నారు. అప్రూవల్ చేసిన కార్డుల్లో కొత్తవాటితోపాటు, మార్పు చేర్పులు చేపట్టినవి కూడా ఉన్నాయి. రేషన్ కార్డులో పేరు తొలగింపునకు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, పేరు చేర్చాలంటే మీ సేవలో దరఖాస్తు చేయాలని సివిల్ సప్లాయిస్ అధికారులు చెబుతున్నారు.
రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ
రేషన్‌కార్డుల జారీ, పేర్ల మార్పులు, చేర్పుల ప్రక్రియ నిరంతరం సాగుతుంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జిల్లాలో మరో 6,459 కొత్త రేషన్‌కార్డులు అప్రూవల్ దశలో ఉన్నాయి. రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి అనుమతి రాగానే లబ్ధిదారులకు కార్డులు జారీ చేస్తాం.
– రుక్మిణి, జిల్లా సివిల్ సప్లయీస్ అధికారి

3,500 ఇన్.. 3,390 అవుట్