
ముంపు ముప్పు
పొంచి ఉన్న
పోలవరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌తో భద్రాచలంలో భయం.. భయం
● మేడిగడ్డ బరాజ్‌తోనూ తప్పదని మంత్రి ఉత్తమ్ ప్రకటన ● పోలవరం ప్రభావంపై హైదరాబాద్ ఐఐటీ బృందంతో సర్వే ● ఎగువ బరాజ్‌ల ప్రభావంపైనా సర్వే చేయాలని డిమాండ్లు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పోలవరం ప్రాజెక్ట్ ముంపుపై స్పష్టమైన అంచనాలు బయటకు రాకముందే మేడిగడ్డ బరాజ్‌తోనూ భద్రాచలం ప్రాంతానికి ప్రమాదమని రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించడం సంచలనంగా మారింది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ఆరంభించే సమయంలో సెంట్రల్ వాటర్ కమిషన్ 2016లో గోదావరి బ్యాక్ వాటర్ వల్ల కలిగే ముంపు సమస్యపై అధ్యయనం చేసింది. ప్రాజెక్ట్‌లో 45.72 మీటర్ల మేర నీటిని గరిష్ట స్థాయిలో నిల్వ చేస్తే గోదావరి ఎగువ భాగంలో ఏ మేరకు ప్రభావం ఉంటుందనే వివరాలను ఇందులో పేర్కొన్నారు. ఇప్పటివరకు పోలవరం బ్యాక్ వాటర్‌కు సంబంధించి ఈ నివేదికే ప్రామాణికంగా ఉంది. దీని ప్రకారం పోలవరం డ్యామ్ దగ్గర 45 అడుగుల మేర నీరు నిలిచినా భద్రాచలం పట్టణంతోపాటు ఎగువన ఉన్న బూర్గంపాడు, దుమ్ముగూడెం, చర్ల మండలాలకు ముంపు భయం ఉండదని పేర్కొంది. కానీ 2022 జూలైలో వచ్చిన భారీ వరద సీడబ్ల్యూసీ అంచనాలను తారుమారు చేసింది.
సందేహాలకు తావిచ్చేలా..
మూడేళ్ల క్రితం 2022, జూలై 16న అర్ధరాత్రి 27 లక్షల క్యూసెక్కుల వరద ఉధృతి ఉండగా, భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 71.30 అడుగులకు చేరుకుంది. కరకట్ట ఎత్తు 80 అడుగులు కావడంతో దాదాపుగా అంచుల దగ్గర వరకు అన్నట్టుగా వరద పోటెత్తింది. ఎటపాక దగ్గరయితే కరకట్ట మీద నుంచి నీళ్లు ఊళ్లోకి రావడం మొదలైంది. దీంతో ఏ క్షణమైనా కరకట్ట తెగిపోయి భద్రాచలం జలమయం అవుతుందా అనే భయాలు నెలకొన్నాయి. ఆ తర్వాత వరద తగ్గుముఖం పట్టడంతో ప్రమాదం తప్పింది. సాధారణంగా గోదావరికి వరద ఎంత వేగంగా పెరుగుతుందో అంతే వేగంగా తగ్గిపోతుంది. కానీ 2022లో 71 అడుగుల గరిష్ట స్థాయికి చేరుకున్న వరద తిరిగి 51 అడుగుల స్థాయికి చేరుకునేందుకు రెండున్నర రోజుల సమయం పట్టింది. పోలవరం డ్యామ్ కారణంగానే వరద వెనక్కి తగ్గడంలో ఆలస్యమైందనే సందేహాలు వ్యక్తమయ్యాయి. దీంతో పోలవరం – భద్రాచలం ముంపు అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
పోలవరం అథారిటీ దృష్టికి..
గోదావరిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ కారణంగా తెలంగాణలో 103 గ్రామాల్లో 954 ఎకరాలు, 16 వేలకు పైగా ఇళ్లు ముంపునకు గురవుతున్నాయంటూ పోలవరం అథారిటీ దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్లింది. దీనిపై ఏపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ముంపు కేవలం 200 ఎకరాల లోపే ఉంటుందని వాదించింది. చివరకు ముంపుపై జాయింట్ సర్వే చేపట్టాలని ఈ ఏడాది మార్చిలో నిర్ణయించారు. ఓవైపు వాదనలు సాగుతుండగానే ముంపు ప్రభావం తెలుసుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తి చూపించారు. తెలంగాణపై పోలవరం ముంపు ప్రభావాన్ని అంచనా వేసి సమగ్ర నివేదిక తయారు చేసే బాధ్యతను హైదరాబాద్ ఐఐటీకి అప్పగించారు. జనవరి 4న ఆదేశాలు జారీ చేస్తూ ఫిబ్రవరి చివరి నాటికి నివేదిక రావాలంటూ గడువు విధించారు.
ఆలస్యంగానైనా వస్తున్నారు..
సీఎం ఆదేశాల మేరకు ఐఐటీ బృందం వచ్చే వారం పది రోజుల్లో క్షేత్రస్థాయిలో పరిశీలనకు వచ్చే అవకాశం ఉంది. ఈ పర్యటనకు సంబంధించిన ఖర్చుల నిమిత్తం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.19 లక్షలు మంజూరు చేసింది. ఈ ఏడాది జనవరిలో సీఎం నుంచి ఆదేశాలు వచ్చాక ఐఐటీ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసింది. గతంలో వచ్చిన భారీ వరదలు, వాటి తాలూకు ప్రభావం తదితర వివరాల కోసం సీడబ్ల్యూసీ, రాష్ట్ర ఇరిగేషన్ శాఖల దగ్గరున్న రిపోర్టులను సదరు కమిటీ అధ్యయనం చేసింది. చివరగా క్షేత్రస్థాయిలో పరిశీలనకు రానుంది. భద్రాచలానికి దిగువన ఉన్న పోలవరంతోపాటు ఎగువన ఉన్న మేడిగడ్డ, సమ్మక్క సాగర్ బరాజ్‌ల వల్ల భద్రాచలం పట్టణానికి ఉండే ముప్పు, వాటిని సమర్థంగా ఎదుర్కొనే అంశాలపై హైదరాబాద్ ఐఐటీ బృందం దృష్టి సారించాలని జిల్లా వాసులు కోరుతున్నారు.