మున్సిపల్‌ కార్యాలయంలో ఏసీబీ సోదాలు | - | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

Jul 19 2025 3:46 AM | Updated on Jul 19 2025 3:46 AM

మున్సిపల్‌ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

మున్సిపల్‌ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

పాల్వంచ: పాల్వంచ మున్సిపల్‌ డివిజన్‌ కార్యాలయంలో మరో సారి ఏసీబీ తనిఖీలు చేపట్టడం కలకలం రేపింది. శుక్రవారం ఏసీబీ డీఎస్పీ ఐ.రమేశ్‌ ఆధ్వర్యంలో ఆకస్మికంగా కార్యాలయానికి చేరుకున్న అధికారులు గేట్లు, తలుపులు మూసి సిబ్బందిని బయటకు వెళ్లకుండా కట్టుదిట్టం చేశారు. మొదటగా మేనేజర్‌ ఎల్‌వీ సత్యనారాయణతో మాట్లాడారు. అనంతరం సమాచారం అందుకున్న కొత్తగూడెం కార్పొరేషన్‌ కమిషనర్‌ కె.సుజాత కార్యాలయానికి రాగా ఆమెతో పాటు ఇతర సిబ్బందిపై విచారణ చేపట్టారు. కాగా కార్యాలయంలో ఇటీవల జరిగిన పలు అభివృద్ధి పనులు, ఆరోపణలపై ఫిర్యాదులు వచ్చాయని ఈ క్రమంలో తనిఖీలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. కాగా కార్యాలయ సిబ్బంది వద్ద అనధికారికంగా ఉన్న రూ.40 వేల నగదును సైతం సీజ్‌ చేశారు.

ఉదయం నుంచి రాత్రి వరకు

కొనసాగుతున్న విచారణ

ఉదయం 11.30 గంటల సమయంలో ఆకస్మికంగా కార్యాలయానికి చేరుకున్న ఏసీబీ అధికారులు కార్యాలయంలో పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కమిషనర్‌ గదిలోకి సంబంధిత రికార్డులు తెప్పించుకుని వాటిని పరిశీలించారు. ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధి పనుల్లో అనేక అవకతవకలు జరిగాయని, బినామీల పేరుతో అధికారులే పనులు చేపట్టారని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. అడ్డగోలుగా బిల్లులు చేసి నగదును పక్కదోవ పట్టించినట్లు పలు ఫిర్యాదులు వెల్లువెత్తిన క్రమంలో ఏసీబీ అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇటీవల జరిగిన పనుల వివరాలు, ఏవిధంగా పనులు కట్టబెట్టారు? ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే కోణాల్లో విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, కొందరు ప్రైవేట్‌ ఉద్యోగులను అడ్డుపెట్టుకుని అధికారులు అక్రమార్జన చేశారని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలోనే ఏసీబీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కాగా, కొందరు ప్రైవేట్‌ ఉద్యోగులు, డ్రైవర్లు, అటెండర్లు, ఇతర సిబ్బంది ఉద్యోగుల ఫోన్‌ పే, గూగుల్‌ పే, ఖాతాల ద్వారా జరిగిన లావాదేవీలను సైతం క్షుణ్ణంగా పరిశీలించారు. కొందరి ఫోన్లలో భారీ ఎత్తున నగదు బదిలీలు జరిగినట్లు గుర్తించారు. ఈ లావాదేవీలు ఎందుకు జరిగాయనే కోణంలో ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

ఈ ఏడాదిలో రెండోసారి..

ఈ ఏడాది ఏప్రిల్‌ 18న మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌ వెంకట రమణి, ప్రైవేట్‌ ఉద్యోగి ప్రసన్నకుమార్‌ను పట్టుకున్నారు. ఈ క్రమంలో మరో సారి ఏసీబీ తనిఖీలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది.

కార్యాలయ నిర్వహణపై వచ్చిన

ఫిర్యాదుల తో ఆకస్మిక తనిఖీ

ఆరోపణల నేపథ్యంలో విచారణ

కార్యాలయంలో ఇటీవల జరిగిన అనేక పనుల విషయంలో జరిగిన అవకతవకలు, ప్రైవేట్‌ వ్యక్తులతో చేస్తున్న అక్రమార్జన వంటి విషయాలపై ఫిర్యాదులు రావడంతో విచారణ చేపట్టాం. ఉన్నతాధికారులకు నివేదికలు పంపిస్తాం. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి జరిగినా, డబ్బులు డిమాండ్‌ చేసినా వెంటనే మా దృష్టికి తీసుకురావాలి. టోల్‌ ఫ్రీ నంబర్‌ 1064కు కాల్‌ చేయాలి. లేదా 91543 88981 నంబర్‌లో సంప్రదించాలి. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం.

–ఐ.రమేశ్‌, ఏసీబీ డీఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement