
పంటల బీమాపై పట్టింపేది?
బూర్గంపాడు: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని అటకెక్కించింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదేదారిలో పయనిస్తోంది. అకాల వర్షాలు, వరదలు, కరువు పరిస్థితుల్లో పంటలు నష్టపోయిన రైతులకు బీమా అందే పరిస్థితులు లేవు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవటంతో రైతులకు నష్టం జరుగుతోంది. వ్యవసాయ సీజన్ ప్రారంభమై యాభైరోజులు దాటింది. ఇప్పటి వరకు పంటల బీమాపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం జిల్లాలో వర్షాభావ పరిస్థితులతో పంటలు వడబడుతున్నాయి. ఇలాంటి తరుణంలోరైతులు పంటల బీమా కోసం ఎదురుచూస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుమారు 5.50 లక్షల ఎకరాల్లో రైతులు పంటలను సాగు చేస్తున్నారు. సుమారు 2.95 లక్షల మంది రైతులు పత్తి, వరి, మొక్కజొన్న పంటలను సాగు చేస్తున్నారు. ఉద్యా నవన పంటల సాగు కూడా పెరిగింది. ముఖ్యంగా పామాయిల్ సాగు ఏటా విస్తరిస్తోంది. కానీ, అకాల వర్షాలు, వరదలు నష్టం కలిగిస్తున్నాయి. పంట నష్టం జరిగినప్పుడు బీమా లేక ఎలాంటి పరిహారం అందటం లేదు. భారీ వర్షాలు, వరదలకు పంటలు నష్టపోయినప్పుడు గత బీఆర్‌ఎస్ పాలనలో రైతులకు ప్రభుత్వపరంగా నష్టపరిహారం అందలేదు. దీంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. కానీ, ఈ ప్రభుత్వం కూడా బీమాను పట్టించుకోవడం లేదు. కానీ, గత ఏడాది వానాకాలం సీజన్‌లో భారీ వర్షాలు, వరదలతో పంటలు నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం మాత్రం అందించింది.
2018 వరకు..
2017 – 18 వరకు రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం అమలైంది. రైతులు పంటరుణాలు తీసుకున్నప్పుడు బ్యాంకర్లు ఫసల్ బీమా కోసం రైతుల వాటాను బీమా కింద జమచేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపేవారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను కూడా జతచేసి కేంద్రానికి పంపేది. కేంద్ర ప్రభుత్వం తమ వాటాను కూడా కలిపి బీమా కంపెనీలకు చెల్లించేది. కొన్నిపంటలకు గ్రామాన్ని యూనిట్‌గా , కొన్ని పంటలకు మండలాన్ని యూనిట్‌గా, మరికొన్నింటికి వ్యవసాయ డివిజన్‌ను యూనిట్‌గా తీసుకుని పంటల బీమా అమలు చేశారు. పంటలు నష్టపోయిన తరుణంలో ఫసల్ బీమాతో పెద్దగా మేలు జరగటం లేదనే భావనతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆ పథకాన్ని ఎత్తివేసింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పంటల బీమాను సొంతంగా రాష్ట్రంలో అమలు చేయాలని యోచించింది. విధివిధానాలపై కసరత్తు చేసినట్లు తెలిసింది. అయితే కొత్త బీమా పథకాన్ని అమలు చేయాలా.. లేక ఫసల్ బీమాను మళ్లీ కొనసాగించాలా అనే విషయంలో తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం.
ఎనిమిదేళ్లుగా నిలిచిన పంటల
బీమా పథకం
ఫసల్ బీమాను విస్మరించిన
రాష్ట్ర ప్రభుత్వం
ప్రకృతి వైపరీత్యాలతో పంటలు
నష్టపోతున్న రైతులు
పరిహారం అందక ఆర్థికంగా
చితికిపోతున్న రైతాంగం
తీవ్రంగా నష్టపోతున్నాం..
భారీ వర్షాలు, వరదలకు గత ఏడాది పత్తి చేలు, వరి మాగాణులు బాగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం పంటల బీమా అమలు చేస్తే రైతులకు ఉపయోగం. గత ఏడాది ప్రభుత్వం పంటలు నష్టపోయిన రైతులకు పరిహారమందించింది. దీనికి తోడు బీమా ఉండి ఉంటే రైతులకు మరికొంత లాభం జరిగేది.
–ఇమడాబత్తుని రామకృష్ణ, రైతు
ఫసల్ బీమా అమలు చేయాలి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమాను రాష్ట్రంలో కూడా అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం రైతుల మేలుకోరి తీసుకువచ్చిన పథకాలను రాష్ట్ర ప్రభుత్వాలు సద్వినియోగం చేసుకోవటం లేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
–ఏనుగుల వెంకటరెడ్డి,
బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి

పంటల బీమాపై పట్టింపేది?

పంటల బీమాపై పట్టింపేది?