
కాంగ్రెస్ హయాంలోనే ప్రతిపాదనలు
ములకలపల్లి: సీతారామ ఎత్తిపోతల పథకం (ఎస్‌ఆర్‌ఎల్‌పీ) డిజైన్ చేసిన బీఆర్‌ఎస్ హయాంలో డిస్ట్రిబ్యూటర్ కెనాళ్ల ఊసేలేదని, కాంగ్రెస్ హయాంలో ప్రత్యేకంగా కాల్వల ప్రతిపాదనలు రూపొందించామని ఎమ్మె ల్యే జారె ఆదినారాయణ వెల్లడించారు. దీనిని విస్మరించి ఆదే పార్టీ ఆధ్వర్యంలో భద్రాద్రి జిల్లాకు నీళ్లు ఇవ్వాలని బీఆర్‌ఎస్ ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నెస్పీ కాల్వకు నీటి తరలింపు నేపథ్యంలో, బీజీ కొత్తూరు నుంచి గోదావరి జలాలు మండలంలోని వీకే రామవరం శివారులోని పంప్‌హౌస్–2కు చేరాయి. ఆదివారం పంప్‌హౌస్–2 ద్వారా నీళ్లు ఎత్తిపోయగా, డిశ్చార్జ్ పాయింట్ వద్ద గోదావరి జలాలకు ఎమ్మెల్యే పూజలు చేసి, మాట్లాడారు. ప్రాజెక్ట్ ద్వారా అశ్వారావుపేట నియోజకవర్గంలోని 1.39 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తామని తెలిపారు. ఈ ఏడాది ములకలపల్లి మండలంలో 15,200 ఎకరాలు, చండ్రుగొండలో 16,750, అన్నపురెడ్డిపల్లి మండలంలో 12,560 ఎకరాలకు సాగు నీరందిస్తామని, వచ్చే జూన్ నాటికి అశ్వారావుపేటలో 29 వేలు, దమ్మపేటలో 46 వేల ఎకరాలకు సాగు నీరందిస్తామని వివరించారు.
మొరాయించిన మోటార్లు
పంప్‌హౌస్–2 మోటార్లు కొంతసేపు మోరాయించడంతో ఇరిగేషన్ అధికారులు హైరానా పడ్డారు. రెండుసార్లు ట్రయల్ వేసినా ట్రిప్ అయింది. మూడో మారు ఆన్ చేయడంతో విజయవంతగా నీళ్లు ఎత్తి పోశాయి. 15 కి.మీ. దూరంలోని కమలాపురంలోని పంప్‌హౌస్–3కి రాత్రి 8.30 గంటలకు నీరు చేరుకుంది. కాగా, మండలంలోని వీకే రామవరం పంప్‌హౌస్–2 నుంచి గోదావరి జలాలు దిగువకు పరవళ్లు తొక్కుతున్నాయి. బీజీ కొత్తూరు నుంచి ఇక్కడికి గోదావరి జలాలు గ్రావిటీ ద్వారా వస్తున్న క్రమంలో లీకుల ద్వారా వృథాగా పోతున్నాయి. ఇలా భారీగా లీకేజీలు బయటపడి నీరంతా పోతుండటంతో క్రమేపీ కట్టకు ప్రమాదం ఉంటుందని పలువురు సందేహిస్తున్నారు. నాణ్యతాలోపం వల్లే ఇలాంటివి తలెత్తుతున్నాయని, అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు.
ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
పంప్‌హౌస్–2 వద్ద ప్రత్యేక పూజలు