సూపర్‌బజార్(కొత్తగూడెం): కలెక్టర్ జితేష్ వి పాటిల్‌కు నేషనల్ జియో స్పేషియల్ ప్రాక్టిషనర్ అవార్డు లభించింది. ఈనెల 17న ఐఐటీ బాంబేలో జరుగనున్న ఓపెన్ సోర్స్ జీఐఎస్ డేలో ఐఎస్‌ఆర్‌ఓ మాజీ చైర్మన్ కిరణ్‌కుమార్ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోనున్నారు. దేశంలోనే తొలిసారి జిల్లాలో ఓపెన్ సోర్స్ జీఐఎస్(జియోగ్రాఫికల్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్) ఏర్పాటు చేసి గ్రామీణ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ విశేషంగా కృషి చేయడంతో కలెక్టర్‌ను ఈఅవార్డు వరించింది. ఈ ప్రాజెక్టులో తొలి అడుగుగా కలెక్టర్ చొరవతో ఐఐటీ బాంబే ఆధ్వర్యంలో ఈ ఏడాది మే 6, 7 తేదీల్లో పాల్వంచ అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలలో సదస్సు నిర్వహించారు. జిల్లాలోని అగ్రికల్చర్, మైనింగ్, ఇంజనీరింగ్ విద్యార్థులు హాజరు కాగా క్యూజీఐఎస్(క్వాంటం జియోగ్రాఫికల్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్) ద్వారా గ్రామీణ సమస్యల పరిష్కారానికి జియో స్పేషియల్ డేటాను ఎలా వినియోగించాలో ప్రాక్టికల్‌గా చూపించారు. గోదావరి వరదల సపయంలో నీటిస్థాయిని బట్టి ముంపు గ్రామాలను ముందుగానే గుర్తించి హెచ్చరికలు జారీ చేయడం, వివిధ పీహెచ్‌ిసీ, సబ్ సెంటర్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను జీఐఎస్ ద్వారా మ్యాప్ చేసి విద్యార్థుల ఆరోగ్యంపై డాక్టర్లను అప్రమత్తం చేయడం వంటి వాటికి ఉపయోగపడుతుందని వివరించారు. ఇలాంటి సాఫ్ట్‌వేర్‌ను గ్రామీణ ప్రాంతాలకు సైతం అందుబాటులోకి తెచ్చేలా కలెక్టర్ కృషి చేయడంతో ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
భారజల కర్మాగారం సందర్శన
అశ్వాపురం: మణుగూరు భారజల కర్మాగారాన్ని కలెక్టర్ జితేష్ వి పాటిల్ మంగళవారం సందర్శించారు. పరిపాలన విభాగం కార్యాలయంలో జీఎం శ్రీనివాసరావు, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. భారజలం ఉత్పత్తి అయ్యాక వెలువడే నీటి వ్యర్థాలను తాగునీటిగా మార్చే అంశంపై అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ తిరుమలేష్, డీఈ బ్రహ్మదేవ్, భారజల కర్మాగారం అధికారులు పాల్గొన్నారు.
రక్తదానం చేయండి.. జీవితాలు కాపాడండి
కొత్తగూడెంఅర్బన్: యువత రక్తదానం చేసి పలువురి జీవితాలను కాపాడాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పిలుపునిచ్చారు. ఇండియన్ యూత్ సెక్యూర్డ్ ఆర్గనైజేషన్ సౌజన్యంతో స్థానిక రైల్వే స్టేషన్ ఆవరణలో మంగళవారం నిర్వహించిన రక్త పరీక్ష శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రక్త పరీక్షలతో బ్లడ్ గ్రూప్ తెలుసుకోవడం సులభమని, అత్యవసర సమయాల్లో రక్తదానం చేసే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కేంద్రంలో తాను కూడా రక్త పరీక్ష చేయించుకున్నానని, అవసరమైతే రక్తదానానికీ సిద్ధమని తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీఓ వెంకటరమణ, మనోహర్, వెంకటపుల్లయ్య, డీఎస్పీ రెహమాన్, ట్రాఫిక్ ఎస్‌ఐ నరేష్ తదితరులు పాల్గొన్నారు.
రేపు అందుకోనున్న పాటిల్