
మంత్రుల సభ ఏర్పాట్ల పరిశీలన
ఇల్లెందు: ఇల్లెందు పట్టణంలోని జేకే సింగరేణి హైస్కూల్ గ్రౌండ్‌లో బుధవారం జరిగే సభలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క, రాష్ట్ర గృహనిర్మాణ, రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అదనపు కలెక్టర్ విద్యాచందన మంగళవారం పరిశీలించారు. సుమారు 5 వేల మంది పాల్గొంటున్న ఈ సభలో వడ్డీలేని రుణాలు రూ.5.7 కోట్లు, ఏప్రిల్ నుంచి జూలై వరకు బ్యాంకు లింకేజీ రుణాలు రూ.30 కోట్లు, ప్రమాద బీమా, లోన్ బీమా రూ.15 లక్షలకు సంబంధించిన చెక్కులు పంపిణీ చేయనున్నారు. సభలో కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజు, ఎమ్మెల్యే కోరం కనకయ్య తదితరులు పాల్గొననున్నారు.
అధికారులతో సమీక్ష
ఇల్లెందురూరల్/టేకులపల్లి: ఇల్లెందులో జరిగే మంత్రుల పర్యటన, సభను విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఇల్లెందు, టేకులపల్లి మండలాల సెర్ప్ అధికారులు, సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, ఎన్‌ఆర్‌ఈజీఎస్ సిబ్బందితో అదనపు కలెక్టర్ విద్యాచందన సమీక్ష నిర్వహించారు. ముందుగా రొంపేడు అటవీ ప్రాంతంలో వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారని, ఆ వెంటనే మహిళా శక్తి సంఘాల లబ్ధిదారులతో బహిరంగ సభ ద్వారా సమావేశమవుతారని వివరించారు. సభ మధ్యాహ్నం 12 గంటలకే ప్రారంభమయ్యే అవకాశం ఉందని, ఆలోపు మహిళలు సభా ప్రాంగణానికి వచ్చేలా ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పారు. సమావేశంలో ఎంపీడీఓ ధన్‌సింగ్, డీపీఎం సమ్మక్క, ఏపీఎంలు దుర్గారావు, రవికుమార్, ఏపీఓ శంకర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, టేకులపల్లి మండలం సులానగర్ పీహెచ్‌సీలో నిర్వహించిన వైద్యశిబిరాన్ని అదనపు కలెక్టర్ పరిశీలించారు. రక్తహీనత గురించి మహిళలకు వివరించారు. ఆకుకూరలు ఎక్కువగా తినాలని, మునగాకు, కరివేపాకు, బెల్లంతో తయారు చేసిన రాగి లడ్డు, నువ్వుల లడ్డు, పల్లి చెక్క రోజువారీగా తీసుకోవాలని సూచించారు. వైద్యాధికారి కంచర్ల వెంకటేశ్, ఆయుష్ వైద్యాధికారి విజయశ్రీ, డీపీఎం సమ్మక్క, ఉద్యోగులు రవికుమార్, సునీల్‌కుమార్, నాగేశ్వరరావు, వజ్జా పార్వతి, దేవా, కౌసల్యసింగ్, రాజు పాల్గొన్నారు.