
అభివృద్ధికి ముందడుగు..
● రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా 11 పీఏసీఎస్‌లు ● స్టేషనరీ, కార్యాలయాల నిర్వహణకు నిధులు విడుదల ● ఒక్కో ఎఫ్‌పీఓకు రూ 3.16 లక్షలు.. ● మంత్రి తుమ్మల చేతుల మీదుగా చెక్కుల పంపిణీ
బూర్గంపాడు: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఎఫ్‌పీఓ( రైతు ఉత్పత్తిదారుల సంస్థ)గా అభివృద్ధి చేసేందుకు చేపట్టిన ప్రక్రియలో ముందడుగు పడింది. జిల్లాలో 11 పీఏసీఎస్‌లను తొలి విడతలో ఎఫ్‌పీఓలుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. తద్వారా రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను సులభంగా మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు తక్కువ ధరల్లో ఇన్‌పుట్ సబ్సిడీ పొందడం, రైతుల ఆదాయం పెంచుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎఫ్‌పీఓలను ఏర్పాటుచేశాయి. రైతులకు ఆధునిక సాగు పద్ధతులు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణకు ఈ ఎఫ్‌పీఓలు ఉపయోగపడతాయి. ఎఫ్‌పీఓల్లో సభ్యులైన రైతులకు రుణాలు, ఇతర ఆర్థిక సాయం కూడా అందనున్నాయి.
రైతుల అభివృద్ధే ధ్యేయంగా..
ఎఫ్‌పీఓల్లో కనీసం 150 మంది రైతులు సభ్యులుగా చేరి వాటా ధనం చెల్లించాలి. వీరికి ప్రభుత్వం రూ.15 లక్షల వరకు ఆర్థికసాయం అందిస్తుంది. ఈ నగదుతో రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడంతో పాటు తక్కువ ధరలకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద వ్యవసాయ పనిముట్లు కొనుగోలు చేసుకోవచ్చు. వీటి ద్వారా వచ్చిన ఆదాయం కూడా ఆ రైతులకే అందుతుంది. ఈ ఆదాయంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, విత్తనోత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసుకుని తమ పరిధిని మరింతగా విస్తరించుకోవచ్చు. ఎఫ్‌పీఓల్లో రైతులు చెల్లించిన వాటాకు ప్రభుత్వం ఈక్విటీ గ్రాంట్ అందిస్తుంది. ప్రాజెక్ట్ రుణాలకు రూ.2 కోట్ల వరకు క్రెడిట్ గ్యారంటీ సౌకర్యం కల్పిస్తుంది. ఇలా రైతుల ఆర్థిక సామర్థ్యాలు బలోపేతమయ్యే అవకాశం ఉంటుంది. జిల్లాలో ఐదు నెలల క్రితం ఎఫ్‌పీఓల ప్రక్రియ ప్రారంభమైంది. కొన్ని పీఏసీఎస్‌లలో రైతులు తమ వాటాధనం చెల్లించి ఎఫ్‌పీఓలలో చేరారు. ఈ సంస్థలకు అవసరమైన స్టేషనరీ, ఫర్నిచర్ కొనుగోలుకు రూ 3.16 లక్షల చొప్పున ప్రభుత్వం మంజూరు చేసింది. కాగా, హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఎఫ్‌పీఓలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెక్కులు అందజేశారు. జిల్లా నుంచి ఎంపికై న పీఏసీఎస్ చైర్మన్లు, సెక్రటరీలు ఈ చెక్కులు అందుకున్నారు.