ఐటీఐల ఏర్పాటు కలేనా? | - | Sakshi
Sakshi News home page

ఐటీఐల ఏర్పాటు కలేనా?

Jul 14 2025 4:41 AM | Updated on Jul 14 2025 4:41 AM

ఐటీఐల

ఐటీఐల ఏర్పాటు కలేనా?

ఇల్లెందు: జిల్లాలోని ఇల్లెందు, అశ్వారావుపేటలో ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ ఐటీఐలు ప్రారంభమయ్యే అవకాశాలు అడుగంటాయి. గత మార్చి లో రెండు ఐటీఐలు ప్రభుత్వం మంజూరు చేస్తూ జీఓ జారీ చేసి సౌకర్యాల కల్పనకు నిధులు కూడా విడుదల చేసింది. దీంతో కలెక్టర్‌ జితేశ్‌ వి.పాటిల్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని భూమి ఎంపిక చేసి ప్రభుత్వం వద్దకు ఫైల్‌ పంపించారు. కానీ, సీసీఎల్‌ఏ నుంచి భూమి కేటాయించకపోవడంతో ఐటీఐలు ప్రారంభానికి నోచుకోలేదు. మొదటి విడత కౌన్సెలింగ్‌ గడువు కూడా ముగిసింది. దీంతో వృత్తి విద్య నేర్చుకోవాలనుకున్న ఈ ప్రాంత విద్యార్థుల్లో నైరాశ్యం నెలకొంది.

కార్యరూపం దాల్చలేదు..

విద్యా సంవ్సతరం ప్రారంభమైనా ఐటీఐల ఏర్పాటు ప్రక్రియ కార్యరూపం దాల్చ లేదు. ఆరు నెలల కిందట అధికారులు, ప్రజా ప్రతినిధులు హడావుడి చేశారు. భూమి గుర్తించారు. ఆ తర్వాత ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. జేకే ఏరియాలోని నూతన గ్రంథాలయ వద్ద నాన్‌వెజ్‌ మార్కెట్‌ స్థలం కేటాయించారు. గత మార్చి 10వ తేదీన జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వి.పాటిల్‌, ఎమ్మెల్యే కోరం కనకయ్య, సింగరేణి ఇల్లెందు ఏరియా జీఎం వీసం కృష్ణయ్య స్థలం పరిశీలించారు. మార్చి 13న తహసీల్దార్‌ నుంచి కలెక్టర్‌కు స్థలం కేటాయిస్తూ లేఖ అందజేయగా జిల్లా కలెక్టర్‌ నుంచి మార్చి 15న స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీకి పంపించారు.

సీసీఎల్‌ఏలో నిలిచిన ఫైల్‌

హైదరాబాద్‌లో సీసీఎల్‌ఏలో ఐటీఐలకు సంబంధించిన ఫైల్‌ నిలిచిపోయింది. ఐటీఐలకు స్థలం కేటాయిస్తూ సీసీఎల్‌ఏ నుంచి ఆదేశాలు అందితే ఇక్కడ ఐటీఐ ప్రారంభం అయినట్లేనంటున్నారు. భూమి కేటాయింపు జరుగనంత కాలం అనుమతి లభించదంటున్నారు. తక్షణం భూమి కేటాయించేలా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచటమే మార్గం అంటున్నారు. కాగా, జిల్లాలో మరో పాటిటెక్నిక్‌ కాలేజీ కృష్ణసాగర్‌లో మంజూరు కాగా భూమి కేటాయింపు సమస్యగా మారింది. పాలిటెక్నిక్‌ కళాశాల కోసం 10 ఎకరాల స్థలం ఎంపిక చేశారు. నిధులు కూడా మంజూరై భూమి కేటాయింపు ఆదేశాలు అందితే ప్రారంభం అయ్యే అవకాశం ఉండేది.

ఐటీఐల్లో మొదటి విడత కౌన్సెలింగ్‌ పూర్తి

ఇల్లెందు, అశ్వారావుపేటలో ఏర్పాటుపై నీలినీడలు

ఏర్పాటైతే 200 మంది చొప్పున విద్యార్థులకు అవకాశం

ఇంకా అనుమతి రాలేదు..

ఐటీఐ ప్రారంభించేందుకు ప్రభుత్వం నంచి అనుమతి రాలేదు. మొదటి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ కూడా పూర్తయింది. రెండో విడత కౌన్సెలింగ్‌ తేదీ కూడా త్వరలో రాబోతుంది. అప్పటికై నా అనుమతి లభిస్తే ప్రారంభించే అవకాశం ఉంటుంది.

–జి.వెంకటేశ్వర్లు, వైస్‌ ప్రిన్సిపాల్‌, ఇల్లెందు ఐటీఐ

ఈ ఏడాదే ప్రారంభించాలి..

ఇల్లెందు, అశ్వారావుపేట ఐటీఐలు, కృష్ణసాగర్‌లోని పాలిటెక్నిక్‌ కాలేజ్‌లు ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలి. విద్యార్థులు సాంకేతిక విద్య కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలి.

–భయ్యా అభిమన్యు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు

ఐటీఐ వస్తే ఐదు ట్రేడ్లు

ఇల్లెందు ఐటీఐలో ఐదు ట్రేడ్‌లతో 200 మందితో ఏర్పడనున్న ఐటీఐ వల్ల ఈ ప్రాంత విద్యార్థులకు సాంకేతిక విద్య విద్య అందుతుంది. ప్రతీ ట్రేడ్‌లో 40 మంది విద్యార్థులకు అవకాశం ఉంది. ఎలక్ట్రీషియన్‌ కోర్సులో రెండేళ్లు 2 యూనిట్లు 40 మంది విద్యార్థులు, ఫిట్టర్‌లో రెండేళ్లు 2 యూనిట్లు 40 మంది విద్యార్థులు, ఐఓటీ స్మార్ట్‌ అగ్రికల్చర్‌లో ఏడాది, 2 యూనిట్లు 40 మంది విద్యార్థులు, ఫ్యాషన్‌ డిజైనర్‌ టెక్నాలజీలో ఏడాది 2 యూనిట్లు 40 మంది విద్యార్థులు, మెకానిక్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ కోర్సు ఏడాది 2యూనిట్లు 40 మంది విద్యార్థులు ఉండేలా చర్యలు చేపట్టారు. కృష్ణసాగర్‌ ఐటీఐ నుంచి ఇన్‌చార్జ్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ను కూడా కేటాయించారు.

ఐటీఐల ఏర్పాటు కలేనా?1
1/1

ఐటీఐల ఏర్పాటు కలేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement