● బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ వారిని వేటాడి చంపుతున్నాయి ● మాస్‌లైన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌సింగ్ ఠాగూర్
ఇల్లెందు : కేంద్రంలో నరేంద్రమోడీ మూడోసారి అధికారంలోకి వచ్చాక మైనార్టీలను శత్రువులుగా చూడడమే కాక, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు వారిని వేటాడి హతమారుస్తున్నారని సీపీఐ(ఎంఎల్)మాస్‌లైన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఠాగూర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామిక హక్కులు కాలరాయడంతో పాటు రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారని విమర్శించారు. మాస్‌లైన్ దివంగత నాయకులు రాయల చంద్రశేఖర్, గండి యాదగిరి స్మారక స్తూపాలను ఇల్లెందులో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఠాగూర్ మాట్లాడుతూ.. దేశంలో ఒక శాతం ఉన్న కార్పొరేట్ శక్తులకు సంపద మొత్తం కట్టబెడుతున్నారని, ప్రశ్నించిన వారిని అర్బన్ నక్సలైట్లుగా ముద్ర వేసి జైళ్లపాలు చేస్తున్నారని ఆరోపించారు. దివంగత నేత రాయల చంద్రశేఖర్ రైతుల సమస్యలపైనే జీవితాంతం పోరాడారని, దేశ వ్యాప్తంగా వివిధ పేర్లతో ఉన్న రైతు సంఘాలను సమన్వయం చేసి ఒకే సంఘంగా ఏర్పాటు చేయాలని పార్టీ వద్ద ప్రతిపాదన పెట్టారని వివరించారు. ఆయన అశయ సాధన కోసం అందరూ పోరాడాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ మాస్‌లైన్ ఆవిర్భావంలో రాయల చంద్రశేఖర్ కీలక భూమిక పోషించారని, పార్టీ విస్తరించే క్రమంలో ఆయన మరణం తీరని లోటని అన్నారు. దేశంలో కమ్యూనిస్టులను నిర్మూలించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కంకణం కట్టుకున్నాడని, ఛత్తీస్‌గఢ్‌లో రక్తపుటేరులు పారిస్తున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి అఽధికారం కోసం 420 హామీలు ఇచ్చారని, ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రకటించినా అమలులో ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, చంద్రశేఖర్ సతీమణి విమల, మాస్‌లైన్ నాయకులు రాయల రమ, కె.జి.రాంచందర్, చిన్న చంద్రన్న, కెచ్చెల రంగయ్య, చండ్ర అరుణ, ముద్దా భిక్షం, నాయిని రాజు, జగ్గన్న, రాము, బిచ్చా, కె రవి, కృష్ణ, బుర్ర వెంకన్న, యాకుబ్‌షావలి, రేసు బోసు, కాంపాటి పృథ్వీ, అజయ్, పాయం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
మైనార్టీలను శత్రువులుగా చూస్తున్నారు..