
రేగాను పరామర్శించిన కోనేరు కోనప్ప
కరకగూడెం: బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తల్లి ఇటీవల మృతిచెందగా.. సిర్పూర్ కాగజ్‌ననగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆదివారం రేగాను పరామర్శించారు. ఆయన తల్లి నర్సమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంతకుముందు వివిధ పార్టీల నాయకులు కాంతారావును పరామర్శించారు.
వరద తగ్గింది..
బురద మిగిలింది
భద్రాచలంటౌన్: భద్రాచలం వద్ద గోదావరికి భారీ వరద వచ్చి తగ్గింది. సుమారు 42 అడుగులకు చేరుకోవడంతో స్నానఘట్టాలు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి. వరద తగ్గడంతో ఆదివారం కొంత మేరకు స్నానఘట్టాలపై నీరు తగ్గింది. కానీ బురద మిగిలిపోయింది. దీంతో స్నానాలు ఆచరించేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అక్కడక్కడా భక్తులే బురదను తొలగించుకుని స్నానాలు చేశారు.
నాటు కోళ్ల చోరీకి యత్నం
జూలూరుపాడు: మండల కేంద్రంలోని ఓ కోళ్ల ఫారంలోని నాటు కోళ్లను గుర్తు తెలియని యువకుడు చోరీ చేసేందుకు యత్నించిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. జూలూరుపాడుకు చెందిన ప్రభాకర్ తన వ్యవసాయ క్షేత్రంలో నాటు కోళ్లు పెంచుతున్నాడు. శనివారం మధ్యాహ్నం గుర్తుతెలియని యువకుడు కోళ్ల ఫారం షెడ్‌లోకి ప్రవేశించి కోళ్లు ఎత్తుకెళ్లేందుకు యత్నించాడు. సీసీ కెమెరాలు అమర్చిన విషయాన్ని గమనించకుండా ఐరన్ జాలీని తొలగించి లోపలికి ప్రవేశించి కోళ్లు ఎత్తుకెళ్లేందుకు యత్నించడంతో సీసీ కెమెరాల అలర్ట్ సైరన్ మోగింది. దీంతో యువకుడు పారిపోయాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదుచేసినట్లు యజమాని ప్రభాకర్ పేర్కొన్నాడు.
సింగరేణి హాస్టల్ వద్ద పడిగాపులు
సింగరేణి(కొత్తగూడెం): రామవరం సీఆర్‌పీ క్యాంపులోని సింగరేణి ఇంటర్మీడియట్ మహిళల వసతిగృహం వద్ద పిల్లలను చూసేందుకు వచ్చిన తల్లిదండ్రులు ఆదివారం పడిగాపులు కాశారు. హాస్టల్ వార్డెన్, మహిళా సెక్యూరిటీ గార్డులు యాజమాన్యం ఆదేశాలను బేఖాతరు చేస్తూ తల్లిదండ్రులను గంటల కొద్దీ ఎదురుచూసేలా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, విద్యార్థులను చూసేందుకు వచ్చే తల్లిదండ్రులను ఒకరి తర్వాత ఒకరిని లోపలికి అనుమతించాలని యాజమాన్యం నిబంధనలు పెట్టినప్పటికీ సిబ్బంది పాటించడం లేదని, దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు సమాచారం. తల్లి లేదా తండ్రి ఒకరే విద్యార్థిని కలవాలని చెబుతున్నట్లు తెలిసింది.

రేగాను పరామర్శించిన కోనేరు కోనప్ప