
నగరాలు, పట్టణాలకు నిధులు..
● కార్పొరేషన్, మున్సిపాలిటీలకు విడుదల చేస్తూ జీఓ ● స్వచ్ఛభారత్ మిషన్ కింద మంజూరు ● టాయిలెట్లు, భవనాల నిర్వహణకు వినియోగం ● కేఎంసీకి రూ.3.71 కోట్లు..
ఖమ్మంమయూరిసెంటర్ : నిధులు లేక నిర్వహణలో ఇబ్బంది పడుతున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. నగరాలు, పట్టణాలకు స్వచ్ఛభారత్ మిషన్ (అర్బన్) 2.0 కింద 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి నిధులు విడుదల చేస్తూ సీడీఎం, స్టేట్ మిషన్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపాలిటీల్లో టాయిలెట్లు, భవనాల నిర్వహణ, బయోమైనింగ్ పనులకు ఈ నిధులను వినియోగించుకునేలా వీలు కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు మధిర, మణుగూరు, సత్తుపల్లి, వైరా, ఇల్లెందు మున్సిపాలిటీలకు ఈ నిధులు విడుదల చేశారు. పాల్వంచ మున్సిపాలిటీ కొత్తగూడెం కార్పొరేషన్‌లో విలీనం కావడంతో ఆ పట్టణ నిధులను కూడా కొత్తగూడెం కార్పొరేషన్‌కు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు.
మెరుగుపడనున్న సౌకర్యాలు..
మున్సిపాలిటీలకు సరైన నిధులు లేక, ఆదాయం రాక కార్యాలయ భవనాల నిర్వహణ, టాయిలెట్ల నిర్వహణ అంతంతమాత్రంగానే ఉంటోంది. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయ వనరులు తగ్గడంతో మున్సిపాలిటీలపై భారం పెరిగింది. ఈ తరుణంలో ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ కింద నిధులు విడుదల చేయడంతో మున్సిపాలిటీల్లో సౌకర్యాలు మెరుగయ్యే అవకాశం ఉంది.
బయోమైనింగ్‌కు నిధులు..
పట్టణాలు, నగరాలు విస్తరిస్తుండడం, జనాభా పెరగడంతో వ్యర్థాల నిర్వహణ మున్సిపాలిటీలపై తీవ్ర ప్ర భావం చూపుతోంది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో వ్యర్థాల డంపింగ్ పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్యకు చెక్‌పెట్టేందుకు కేఎంసీ అధికారులు బయో మైనింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో దశాబ్దాలుగా పేరుకుపోయిన వ్యర్థాలను శుభ్రం చేస్తున్నారు. బయోమైనింగ్ నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కేటాయించింది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.3.71 కోట్లుకు పైగా ఎస్‌బీఎం కింద నిధులను కేటాయించగా.. ఇందులో రూ.3,35,62,783 బయోమైనింగ్‌కు కేటాయిస్తు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక కొత్తగూడెం కార్పొరేషన్‌కు రూ.99.17 లక్షల నిధులు విడుదల చేయగా.. బయోమైనింగ్ కోసం రూ.76,65,007 కేటా యించారు. ఇల్లెందు మున్సిపాలిటీకి రూ.8,17,360 మంజూరు కాగా, బయోమైనింగ్‌కు రూ.1,36,924 కేటాయించారు.