
మరో పోరాటానికి సిద్ధం కావాలి
● అభివృద్ధి చెందుతున్న దశలో కాంగ్రెస్ చేతికి రాష్ట్రం ● తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత
సూపర్‌బజార్(కొత్తగూడెం): అనేక పోరాటాలు, ప్రాణత్యాగాలతో సాధించుకున్న తెలంగాణ.. అభివృద్ధి చెందుతున్న దశలో కాంగ్రెస్ చేతికి వెళ్లి తిరోగమనంలో పయనిస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. కొత్తగూడెం క్లబ్‌లో గురువారం నిర్వహించిన తెలంగాణ జాగృతి సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రం ప్రగతిబాటలో పయనించేందుకు మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 18 నెలల కాలంలో సీఎం రేవంత్‌రెడ్డి ఒక్కసారి కూడా జై తెలంగాణ అనలేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు విస్మరించారని, పెన్షన్లు పెరగక పోగా, రైతులందరికీ రుణమాఫీ చేయలేదని ఆరోపించారు. రాష్ట్రంలో పరిపాలన అధ్వానంగా మారిందని, చర్చకు సిద్ధమన్న సీఎం.. రమ్మంటే తోకముడిచి పారిపోతున్నాడని ఎద్దేవా చేశారు. సింగరేణిని ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 ఇస్తామన్న హామీని అటకెక్కించారని విమర్శించారు. రాష్ట్రాల పునర్విభజన సందర్భంగా ఏపీలో విలీనమైన ఐదు పచాయతీలను తెలంగాణలో కలపాలని అక్కడి సీఎంకు లేఖ రాశామన్నారు. భద్రాచలం రామాలయం ఈఓ రమాదేవిపై జరిగిన దాడిని ఆమె ఖండించారు. కాగా, సీఐటీయూ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి డి.వీరన్న తన అనుచరులతో కవిత సమక్షంలో తెలంగాణ జాగృతిలో చేరారు.
‘సీతారామ’ తక్షణమే పూర్తి చేయాలి
పాల్వంచ/పాల్వంచరూరల్ : పెండింగ్‌లో ఉన్న సీతారామ ప్రాజెక్ట్ పనులు తక్షణమే పూర్తి చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. పాల్వంచలో విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా సీతారామ ప్రాజెక్ట్ పనులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. అనంతరం పెద్దమ్మతల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు రూప్‌సింగ్, సదానందం గౌడ్, మాధవి, పవన్ నాయక్, సిఽంధు తపస్వి, హుస్సేన్, కాపు కృష్ణ, నవతన్, కిరణ్‌మార్, వరప్రసాద్, కాంపెల్లి కనకేష్, అనుదీప్, శ్రీరామ్మూర్తి పాల్గొన్నారు.
రేగాకు పరామర్శ..
కరకగూడెం: బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు తల్లి నర్సమ్మ బుధవారం మృతిచెందగా, కవిత గురువారం కుర్నవల్లిలో రేగాను పరామర్శించారు. నర్సమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ జాగృతి పోరాటం వల్లే రాష్ట్ర కేబినెట్ బీసీ బిల్లుకు ఆమోదం తెలిపిందని కవిత అన్నారు. కుర్నవల్లిలో విలేకరులతో మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం శుభ పరిణామమని అన్నారు. ఈ బిల్లు దేశానికి కూడా దారి చూపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘కొత్త పార్టీ పెడుతున్నారా’ అని విలేకరులు కవితను ప్రశ్నించగా ‘జై తెలంగాణ’ అంటూ సమాధానమిచ్చారు.
తాతా, వనమా పరామర్శ..
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావును పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు గురువారం పరామర్శించారు. ఆయన తల్లి నర్సమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు.