
తెరుచుకునేనా?
● పాతికేళ్లపాటు నడిచి పదేళ్ల క్రితం మూతపడిన పరిశ్రమ ● ఫ్యాక్టరీని తెరవాలంటూ కేంద్రాన్ని కోరిన రాష్ట్ర ప్రభుత్వం ● సాధ్యాసాధ్యాల పరిశీలనకు నిపుణుల కమిటీ ఏర్పాటుకు హామీ ● కేటీపీఎస్ కాంప్లెక్స్‌లో కొత్త ప్లాంట్ ఏర్పాటుకు సైతం ప్రయత్నాలు
‘స్పాంజ్
ఐరన్’
సాక్షి ప్రతినిధి, భద్రాది కొత్తగూడెం: పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచ నడిబొడ్డున ఎన్‌ఎండీసీ, కేటీపీఎస్‌లలో ఇంచుమించు 900 ఎకరాల స్థలం నిరుపయోగంగా ఉంది. ఈ స్థలాల్లో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.
దక్షిణాసియాలోనే మొదటిది..
యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం కింద 1980లో దక్షిణాసియాలోనే మొదటిసారిగా కోల్ బేస్డ్ స్పాంజ్ ఐరన్ యూనిట్‌ను పాల్వంచలో నిర్మించారు. మొదటి యూనిట్ విజయవంతం కావడంతో 1985లో రెండో యూనిట్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ ప్రాజెక్టు ఆధారంగా 1993లో 7.5 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ నెలకొల్పారు. అనంతరం 1997లో పిగ్ ఐరన్ నుంచి స్పాంజ్ ఐరన్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్ నిర్మించారు. ఇలా దశల వారీగా అభివృద్ధి చెందుతూ వచ్చిన ఈ సంస్థను 2010లో ఎన్‌ఎండీసీలో విలీనం చేశారు. ఆ తర్వాత నిర్వహణ లోపాల కారణంగా నష్టాల బారిన పడి 2016లో పూర్తిగా మూతపడింది. అనంతరం రాజకీయ ఒత్తిడితో స్పాంజ్ ఐరన్ ఇండియా, పాల్వంచ యూనిట్‌ను 2019 జనవరిలో ఎన్‌ఎండీసీ సంస్థ తిరిగి ప్రారంభించినా రెండు నెలలకు మించి ఎక్కువ రోజులు నడవలేదు. చివరకు సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరిగినా అవి కూడా ఫలప్రదం కాలేదు.
కేటీపీఎస్‌లో మరో ప్లాంట్ నిర్మించాలని..
పాల్వంచలో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ తొలి యూనిట్ 1969లో మొదలైంది. ఇటీవల కాలపరిమితి ముగియడంతో నాలుగు స్టేజ్‌లకు సంబంధించిన 720 మెగావాట్ల ప్లాంట్‌ను 2020 పూర్తిగా మూసివేశారు. ఆ ప్లాంట్‌కు సంబంధించిన నిర్మాణాలను గతేడాది కూల్చేశారు. దీంతో ఇక్కడ 400 ఎకరాలకుపైగా స్థలం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే బొగ్గు, నీటి లభ్యతతో పాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయి. దీంతో ఇక్కడ 800 మెగావాట్ల సామర్థ్యంతో సూపర్ క్రిటికల్ లేదా ఆల్ట్రా సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో ప్లాంట్ నిర్మించాలని గడిచిన ఏడాది కాలంగా డిమాండ్లు వస్తున్నాయి. కొత్తగూడెం ఎమ్మెల్యే కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ఎంత? భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఎంత విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉంటుందనే అంశాలపై ప్రభుత్వం నివేదిక రూపొందిస్తోంది. ఇందులో కొత్త ప్లాంట్లకు స్థాపన అవసరం ఉందని తేలితే, కేటీపీఎస్ ప్రాంగణంలో ప్లాంట్ ఏర్పాటుకు మార్గం సుగమమం అవుతుంది. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని ప్రయత్నిస్తున్నారు.
చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అవకాశం..
పారిశ్రామిక రంగంలో జిల్లాకు వందేళ్ల చరిత్ర ఉన్నా మధ్య, చిన్న తరహా పరిశ్రమలు రావడం లేదు. కేటీపీఎస్, స్పాంజ్ ఐరన్ పరిశ్రమలను పునరుద్ధరించడం సాధ్యంకాని పక్షంలో ఈ పరిశ్రమల స్థలంలో కోల్డ్ రోలింగ్ మిల్ కాంప్లెక్స్, హాట్ రోలింగ్ మిల్, ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ వెల్డెడ్ పైపుల పరిశ్రమ, సెమికండర్లర్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్, ఇథనాల్ ప్లాంట్, బ్యాటరీస్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటి పరిశ్రమలు స్థాపించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయి. దీంతోపాటు వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు అంశాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు.
మళ్లీ ప్రయత్నాలు
ఏడాది క్రితం ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాక స్పాంజ్ ఐరన్ పరిశ్రమను తెరిపించే ప్రయత్నాలు మళ్లీ మొదలయ్యాయి. 2024 ఫిబ్రవరిలో అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల్లో స్పాంజ్ ఐరన్ పరిశ్రమను తిరిగి నడిపించాలంటూ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. ఆ తర్వాత కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజుల దృష్టికి ఖమ్మం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన తాండ్ర వినోద్‌రావు తీసుకెళ్లారు. తాజాగా రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు విజ్ఞప్తి మేరకు ఈ పరిశ్రమను తిరిగి ప్రారంభించేందుకు గల అవకాశాలు పరిశీలించేందుకు నిపుణుల కమిటీని పంపిస్తానని కేంద్ర పరిశ్రమల మంత్రి కుమారస్వామి హామీ ఇచ్చారు.