
ఆనవాళ్లు కోల్పోతున్న కాలువలు
● నాలుగు దశాబ్దాలుగా మరమ్మతులకు నోచుకోని తాలిపేరు ప్రాజెక్ట్ ● శిథిలమైపోతున్న కుడి, ఎడమ ప్రధాన, డిస్ట్రిబ్యూటరీ కాలువలు ● ఐదారేళ్లుగా చివరి భూములకు అందని సాగునీరు ● ప్రాజెక్ట్‌పై నిర్లక్ష్యం వీడాలని కోరుతున్న ఆయకట్టు రైతులు
చర్ల: తాలిపేరు మధ్యతరహా సాగునీటి ప్రాజెక్ట్ ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోవడంలేదు. ప్రధాన, డిస్ట్రిబ్యూటరీ కాలువలు అధ్వానంగా తయారయ్యాయి. గడిచిన ఐదారేళ్లుగా ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందక చివరి భూముల్లో పంటలు ఎండిపోతున్నాయి. తాలిపేరు ప్రాజెక్ట్‌ను 1985లో నిర్మించారు. ఎడమ కాలువ ద్వారా చర్ల మండలంలోని ఆర్.కొత్తగూడెం, దుమ్ముగూడెం మండలంలోని తూరుబాక (46.46 కిలోమీటర్ల) వరకు సాగునీరు ఇస్తున్నారు. 1992లో కుడి కాలువ 10.44 కిలోమీటర్ల మేర నిర్మించి సాగునీరు అందిస్తున్నారు. రెండు ప్రధాన కాలువలపై 42 డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల ద్వారా ఏటా ఖరీఫ్‌లో అధికారికంగా 24,700 ఎకరాలకు, అనధికారికంగా మరో 15,000 ఎకరాలకు నీటిని విడుదల చేస్తున్నారు.
దశాబ్దాల కాలంగా చిన్నచూపే
తాలిపేరు నిర్మించి 40 ఏళ్లు గడిచినా ప్రాజెక్ట్ అభివృద్ధికి ఏనాడూ పెద్దగా నిధులు కేటాయించలేదు. దీంతో ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల మరమ్మతులు పూర్తిస్థాయిలో చేపట్టడంలేదు. అరకొరగా కేటాయించే నిధులను గేట్లు, మోటార్లు, జనరేటర్లు ఇతర మరమ్మతులు, విద్యుత్ సౌకర్యం పునరుద్ధరణ వంటి పనులకు వినియోగిస్తున్నారు. ఏటా అధికారులు తాత్కాలికంగా కాలువల మరమ్మతులు చేస్తూ సాగునీరు అందిస్తున్నారు.
కూలిపోయిన సైడ్ వాల్స్
చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో ప్రధాన కాలువలు పలు చోట్ల కోతకు గురయ్యాయి. సైడ్ వాల్స్ కూలిపోయాయి. వాగులపై నిర్మించిన యూటీలు దెబ్బతిన్నాయి. దానవాయిపేట, బోటిగూడెం గ్రామాల మధ్య టపావాగుపై ఉన్న యూటీ సైడ్ వాల్స్ కూలాయి. కుదునూరు–దేవరాపల్లి గ్రామాల మధ్య జోడిచీలికలవాగుపై ఉన్న యూటీ కూడా కుంగింది. గత ఖరీఫ్ సమయంలో ఈ రెండు చోట్ల యూటీలకు మరమ్మతులు చేపట్టేందుకు కొంత మేర నిధులు మంజూరయ్యాయి. రబీలో సాగునీరు నిలిపివేసి పనులు చేసేందుకు అధికారులు సిద్ధమవగా, ప్రాజెక్టు పరిధిలోని రెండో జోన్‌లో రబీ పంటలకు సాగునీరు ఇవ్వాల్సిందేనని రైతులు పట్టుబట్టారు. దీంతో పనులను నిలిపివేసి యూటీ కుంగిన ప్రాంతంలో ఇసుక బస్తాలను వేసి సాగునీరు విడుదల చేశారు. ఆ తర్వాత మే, జూన్ నెలల్లో పనులు ప్రారంభించాల్సి ఉన్నా పనులు పూర్తయ్యేందుకు సమయం సరిపోదంటూ కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యం వీడి ప్రాజెక్ట్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
సాగునీటికి ఇబ్బంది రాకుండా చర్యలు
తాలిపేరు ప్రధాన కాలువలకు గండ్లు పడ్డ చోట్ల, యూటీలు కుంగిన చోట్ల తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నాం. ఖరీఫ్ పూర్తికాగానే పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపడతాం.
– ఎస్.ఏ.జానీ, ఈఈ, తాలిపేరు ప్రాజెక్టు
నిర్లక్ష్యం వీడాలి
తాలిపేరు ఆయకట్టు కింద రెండు మండలాల్లోని సుమారు 25 వేల మంది రైతులు పంటలు సాగు చేస్తున్నారు. ప్రాజెక్ట్, కాలువలు దెబ్బతిన్నా మరమ్మతులు చేపట్టకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి.
– కూరపాటి వీర్రాజు, రైతు, ఆర్.కొత్తగూడెం
నిధులు విడుదల చేయాలి
తాలిపేరు ప్రాజెక్ట్, కాలువలకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు చొరవ తీసుకుని అవసరమయ్యే నిధులను విడుదల చేయాలి. ఏజెన్సీ రైతులను ఆదుకోవాలి.
– డేగల అబ్రహం, రైతు, కుదునూరు

ఆనవాళ్లు కోల్పోతున్న కాలువలు

ఆనవాళ్లు కోల్పోతున్న కాలువలు

ఆనవాళ్లు కోల్పోతున్న కాలువలు