
స్వర్ణ కవచధారణలో రామయ్య
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచధారులై దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విష్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శుక్రవారం సందర్భంగా శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పెద్దమ్మతల్లికి
పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి శుక్రవారం వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్‌కు పంచామృతంతో అభిషేకం జరిపారు. పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలు, కుంకుమ పూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
అమ్మవారిని దర్శించుకున్న జెడ్పీ సీఈఓ
పెద్దమ్మతల్లి అమ్మవారిని జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్ సుజాతలు దర్శించుకున్నారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి శేష వస్త్ర ప్రసాదాలను అందజేశారు.
17న మెడికల్ కళాశాలలో ఇంటర్వ్యూలు
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెంలోని మెడికల్ కళాశాలలో వైద్యాధికారుల పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ రాజ్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలోని 20 విభాగాల్లో ప్రొఫెసర్ పోస్టులు 10, అసోసియేట్ ప్రొఫెసర్ 36, అసిస్టెంట్ ప్రొఫెసర్ 18, ట్యూటర్, సీనియర్ రెసిడెంట్ పోస్టులు 37 ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నెల 17న ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మెడికల్ కళాశాలలో జరిగే ఇంటర్వ్యూలకు అర్హులు హాజరు కావాలని కోరారు.
ఆహార భద్రతా ప్రమాణాలను పాటించాలి
కొత్తగూడెంఅర్బన్: హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార ఏజెన్సీల నిర్వాహకులు ఆహార భద్రతా నియమాలను, ప్రమాణాలను పాటించాలని జిల్లా డెసిగ్నేటెడ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ డాక్టర్ వాకా మధువరుణ్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ శరత్ ఆదేశించారు. శుక్రవారం కొత్తగూడెం, పాల్వంచ, సారపాక, భద్రాచలం ప్రాంతాల్లోని వివిధ ఆహార ఏజెన్సీలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫుడ్ సేఫ్టీ అనుమతుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లైసెన్స్‌లు లేకుండా ఆహార వ్యాపారాలు, మాంసాహార విక్రయాలు, బార్ అండ్ రెస్టారెంట్, వైన్‌షాపులు, మినరల్ వాటర్ ప్లాంట్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

స్వర్ణ కవచధారణలో రామయ్య