
‘మారెళ్లపాడు’ పనుల్లో వేగం పెంచాలి
అశ్వాపురం/భద్రాచలంఅర్బన్/చుంచుపల్లి : సీతారామ ప్రాజెక్ట్ ప్రధాన కాల్వకు అనుసంధానంగా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద నిర్మిస్తున్న మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులను తక్షణమే పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ‘నేను వచ్చేదాకా పనులపై పర్యవేక్షణ చేయరా.. అంత సమయం లేదా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఖరీఫ్ నాటికి పనులు పూర్తి చేయాలని ఏడాది క్రితమే చెప్పినా.. ఇంతవరకూ ప్రారంభించలేదని మండిపడ్డారు. ఎత్తిపోతల పథకం పనుల పరిశీలనకు సోమవారం వచ్చిన తుమ్మల.. నీటిపారుదల శాఖ స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్‌పాటిల్‌తో ఫోన్‌లో మాట్లాడారు. నాలుగు నెలల్లో పనులు పూర్తి చేసేలా నిర్మాణ సంస్థను ఆదేశించాలన్నారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ.. సీతారామ ప్రాజెక్ట్ ప్యాకేజీ–1లో భాగంగా మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం ద్వారా తుమ్మలచెరువుకు నీరందించి 16 వేల ఎకరాలు సాగులోకి తెస్తామన్నారు. సీతారామ ప్రాజెక్ట్ ద్వారా మొదట పినపాక, ఆ తర్వాత కొత్తగూడెం, అశ్వారావుపేట, వైరా నియోజకవర్గాలకు సాగునీరు అందించే అవకాశం ఉందని, ప్రధాన కాల్వ పనులు పూర్తయ్యాయని, డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల పనులు సాగుతున్నాయని వివరించారు.
రామాలయ అభివృద్ధి నా చిరకాల వాంఛ..
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధి తన చిరకాల వాంఛ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. భద్రాచలం అంబేద్కర్ సెంటర్‌లో రూ.1.15 కోట్ల వ్యయంతో చేపట్టిన సెంటల్ర్ లైటింగ్, డివైడర్ల పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. మాడ వీధుల విస్తరణకు ఇళ్లు తొలగించిన ప్రదేశాన్ని పరిశీలించాక మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి భూసేకరణ ముఖ్యమని తెలియగానే.. సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా రూ.33 కోట్లు విడుదల చేశారని చెప్పారు. ఆగమశాస్త్ర పండితుల సూచనల ఆధారంగా పనులు జరుగుతాయన్నారు.
జీవజాతులకు ఉపయోగపడే
మొక్కలు నాటాలి..
మనుషులతో పాటు పక్షులు, కోతుల వంటి జీవజాతులకు ఉపయోగపడేలా పండ్ల మొక్కలు విరివిగా నాటేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలం అనిశెట్టిపల్లి అటవీ ప్రాంతంలో సోమవారం నిర్వహించిన వనమహోత్సవాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కోల్పోయిన అటవీ సంపద పునరుద్ధరణకు వనమహోత్సవం నిర్వహించడం హర్షణీయమని అన్నారు. వాతావరణ సమతుల్యత పరిరక్షణకు మొక్కలు నాటడమే ముఖ్యమని చెప్పారు. జిల్లా సమగ్రాభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. అన్ని రవాణా మార్గాలకు కేంద్రంగా జిల్లాను తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ జితేష్ వి పాటిల్, పినపాక, భద్రాచలం, కొత్తగూడెం ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, కూనంనేని సాంబశివరావు, ఐటీడీఏ పీఓ రాహుల్, డీఎఫ్‌ఓ కిష్టాగౌడ్, ట్రైనీ కలెక్టర్ సౌరభ్‌శర్మ, ఎస్పీ రోహిత్‌రాజు, నీటిపారుదల శాఖ ఎస్‌ఈలు శ్రీనివాసరెడ్డి, రవికుమార్, ఈఈ వెంకటేశ్వరరావు, డీఈ శ్రీనివాసరావు, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, భద్రాచలం ఆర్డీఓ దామోదర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ఏడాది దాటినా ఎందుకు ప్రారంభించలేదు..
అధికారుల తీరుపై మంత్రి తుమ్మల ఆగ్రహం
భద్రాద్రి ఆలయ అభివృద్ధే లక్ష్యమని స్పష్టీకరణ
అటవీ సంపద పునరుద్ధరణకు కృషి చేయాలని పిలుపు
మంత్రి రాకతో హడావిడి ..
అశ్వాపురం మండలం బీజీ కొత్తూరులో నిర్మిస్తున్న మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పనుల పరిశీలనకు మంత్రి తుమ్మల సోమవారం రావడంతో అధికారులు హడావిడిగా ఆదివారం పనులు ప్రారంభించారు. శంకుస్థాపన చేసి రెండున్నరేళ్లు గడిచినా ఎర్త్‌వర్క్, బ్లాస్టింగ్ పనులు మాత్రమే చేపట్టారు. పంప్‌హౌస్ నిర్మాణ ప్రధాన పనులు మొదలే కాకపోవడం గమనార్హం.
పొదెం వీరయ్యకు ఆహ్వానమేదీ ?
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభించిన వనమహోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్యను అటవీ శాఖ అధికారులు విస్మరించారు. కార్యక్రమానికి ఆహ్వానం పలికేందుకు ఏర్పాటు చేసిన ప్లెక్సీలో సైతం కనీసం ప్రొటోకాల్ ప్రకారమైనా ఆయనతో పాటు ఎంపీ రఘురాంరెడ్డి ఫొటో పెట్టకపోవడాన్ని పలువురు తప్పుపడుతున్నారు.

‘మారెళ్లపాడు’ పనుల్లో వేగం పెంచాలి