
అర్హులకు సంక్షేమ పథకాలు అందాలి
భద్రాచలంటౌన్: అర్హులైన గిరిజనులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు కృషి చేయాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. ఐటీడీఏ ప్రాంగణంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్‌లో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గిరిజనుల దరఖాస్తులను నిశితంగా పరిశీలించాలని అన్నారు. మత్స్య సొసైటీల ఏర్పాటు, ట్రైకార్ ద్వారా సబ్సిడీ రుణాలు, పోడు భూములు, వ్యక్తిగత సమస్యలు, భూ సమస్యలు, స్వయం ఉపాధి పథకాల రుణాలు, పట్టా భూములకు రైతుబంధు, పోడు పట్టాల్లో పేర్ల మార్పు తదితర అంశాలపై పలువురు దరఖాస్తులు సమర్పించారని వివరించారు. గిరిజన దర్బార్‌లో వచ్చిన ఆర్జీలన్నీ ఆన్‌లైన్ ద్వారా ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేయాలని, అర్హులైన ప్రతి గిరిజన కుటుంబానికీ విడతల వారీగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేలా చర్యలు చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో డీడీ మణెమ్మ, ఆర్సీఓ అరుణ కుమారి, ఉద్యానవనాధికారి ఉదయ్‌కుమార్, ఈఈ హరీష్, రాజారావు, ఆదినారాయణ, చంద్రకళ, భార్గవి, చలపతి, రామ్ కుమార్, మోహన్, స్వాతి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ రాహుల్