
ప్రజావాణి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి
అదనపు కలెక్టర్ వేణుగోపాల్
సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రజావాణిలో వచ్చిన ప్రతీ దరఖాస్తును నిశితంగా పరిశీలించి పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరైన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి, పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకంతో సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అధికారులు వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన తదితరులు పాల్గొన్నారు. కాగా, జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కార్యక్రమాలు ఉండడంతో కలెక్టర్‌తో పాటు కొందరు జిల్లా స్థాయి అధికారులు ప్రజావాణికి హాజరు కాలేదు. ఇక మోహర్రం పండుగ, వ్యవసాయ సీజన్ కావడంతో ఫిర్యాదుదారులు కూడా అంతంతమాత్రంగానే వచ్చారు.