
నిర్లక్ష్యానికి నిండుప్రాణం బలి..
దుమ్ముగూడెం: మండలంలోని మారాయిగూడెం గ్రామంలోని ఓ ఆర్‌ఎంపీ నిర్లక్ష్య కారణంగా పత్తిపాక గ్రామానికి చెందిన సోడి లక్ష్మి(45) మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. లక్ష్మి గత కొంతకాలంగా బీపీతో బాధపడుతూ శుక్రవారం కింద పడిపోయింది. దీంతో కుటుంబసభ్యులు ఓ ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లగా వైద్యం చేసిన సదరు ఆర్‌ఎంపీ భద్రాచలం తరలించాలని సూచించగా.. వారు అక్కడకు తీసుకెళ్లి చూపించారు. అక్కడ పరిస్థితి విషమంగా మారడంతో ఖమ్మంకు రిఫర్ చేయగా.. అంబులెన్స్‌లో వారితో పాటే సదరు ఆర్‌ఎంపీ వెళ్లడం.. మార్గం మధ్యలో తరచూ అపుతూ వెళ్లడంతో ఖమ్మం చేరేసరికి ఆలస్యమైంది. అయినా చికిత్స అందించే క్రమానికి మరింత ఆలస్యం కావడంతో ఆమె మృతి చెందింది. లక్ష్మి మృతికి ఆర్‌ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యమే కారణమంటూ మృతురాలి కుటంబసభ్యులు ఆర్‌ఎంపీకి దేహశుద్ధి చేసినట్టు తెలిసింది.
ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ..
ములకలపల్లి: ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఓ లారీ ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణంపాలయ్యాడు. కొత్తగంగారం అటవీ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలను ఎస్సై కిన్నెర రాజశేఖర్ ఇలా తెలిపారు. అశ్వారావుపేట మండలం దురదపాడు గ్రామానికి చెందిన కుర్సం అర్జున్‌రావు(38) స్నేహితులతో కలిసి ట్రాక్టర్‌పై ములకలపల్లి మండలంలోని పాతగుండాలపాడు వెళ్తున్నాడు. ఈ క్రమంలో మూత్రవిసర్జన నిమిత్తం ట్రాక్టర్‌ను కొత్తగంగారం అటవీ ప్రాంతంలో ఆపగా.. అటు వైపుగా వస్తున్న లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ డ్రైవర్ సీటు పక్కన కూర్చున్న అర్జున్‌రావుతలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్యపద్మఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
గంజాయి స్వాధీనం
పాల్వంచరూరల్: ఒరిస్సా నుంచి తీసుకొచ్చి స్థానికంగా గంజాయిని విక్రయిస్తున్న నలుగురు యువకులను పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మండల పరిధి సోములగూడెం వైపు వెళ్లే మార్గంలో ఆదివారం ఎస్సై సురేష్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాడు. ఈక్రమంలో జామాయిల్ తోటలో పాల్వంచకు చెందిన షకీర్, గోపి, జగన్నాధపురం గ్రామానికి చెందిన చరణ్, శ్రీరాంలు అనుమానస్పదంగా సంచరించడంతో వారిని పట్టుకుని విచారించారు. దీంతో వారి వద్ద ఒరిస్సాలోని బెజంగూడా నుంచి రూ.19వేల విలువ కలిగిన 380 గ్రామాల గంజాయి లభించింది. గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురు యువకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
బీపీతో గిరిజన మహిళ మృతి
వ్యక్తి దుర్మరణం
నలుగురిపై కేసు నమోదు