
వృద్ధురాలిని కాపాడిన గజ ఈతగాడు
భద్రాచలంఅర్బన్: భద్రాచలం పట్టణంలోని గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడుతున్న ఓ వృద్ధురాలని ఓ గజ ఈతగాడు కాపాడాడు. వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రికి చెందిన లక్ష్మి అనే వృద్ధురాలి కుమారుడు రెండు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అంతేకాక ఆమెకూ గుండె సంబంధిత సమస్యతో బాధపడుతుండగా.. తన కుమారుడు మరణం తర్వాత తనను ఎవరూ పట్టించుకోవడంలేదని మనస్థాపంతో గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఈనేపథ్యాన శనివారం నదిలో దూకగా.. స్థానిక గజ ఈతగాడు ప్రసాద్ గమనించి వృద్ధురాలిని కాపాడాడు. తర్వాత ఆమె బాధను ఈతగాడితో పంచుకోక ఆమెకు భోజనానికి కావాల్సిన నగదును అందజేశాడు.
మహిళా రెస్క్యూ టీమ్‌కు సర్టిఫికెట్ల ప్రదానం
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి చరిత్రలో తొలిసారిగా రెస్క్యూలో శిక్షణ పొందిన 13మందితో కూడిన మహిళా జట్టుకు సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ హైదరాబాద్‌లో శనివారం సర్టిఫికెట్లు అందజేశారు. జీఎం(రెస్క్యు) శ్రీనివాస్‌రెడ్డి, డైరెక్టర్లు కె.వెంకటేశ్వర్లు, గౌతమ్ పొట్రు, ఈడీ ఎస్‌డీ.సుభానీ తదితరులు అందజేశారు.
వార్డెన్ బాధ్యతల కోసం పోటాపోటీ
పాల్వంచరూరల్: మండలంలోని కిన్నెరసాని క్రీడా పాఠశాలలో వార్డెన్ బాధ్యతల కోసం పలువురు ఉపాధ్యాయులు పోటీ పడుతున్నారు. ఇందుకోసం రెండు గ్రూపులుగా విడిపోవడం చర్చనీయాంశంగా మారింది. స్కూల్ పునఃప్రారంభమయ్యాక శంకర్ వార్డెన్ విధులు నిర్వర్తిస్తుండగా, ఈనెల 3న వెంకటేశ్వర్లుకు హెచ్‌ఎం రామారావు అప్పగించారు. ఇదే బాధ్యతల కోసం పీడీ అంజయ్య పోటీ పడుతుండడంతో సమస్యను డీడీ దృష్టికి తీసుకవెళ్లారు. అయితే, ఈ ఏడాది వెంకటేశ్వర్లునే కొనసాగించాలని కొందరు ఉపాధ్యాయులు తీర్మానం చేసినట్లు సమాచారం. ఇంతలోనే రెగ్యులర్ హెచ్‌ఎం రామారావు సెలవులో వెళ్లగా ఇన్‌చార్జ్ బాధ్యతలు శంకర్‌కు అప్పగించారు.
రెండు పశువుల మృతి
చర్ల: మండలంలోని కుదునూరుకు చెందిన దొడ్డా వేమయ్యకు చెందిన రెండు ఆవులు, ఒక లేగదూడ శుక్రవారం మేతకు వెళ్లి సాయంత్రం రాలేదు. ఈక్రమాన రాత్రి సమయాన ప్రధాన రహదారిపై ఉండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈఘటనలో రెండు ఆవులు మృతి చెందగా, లేకదూడకు తీవ్ర గాయాలయ్యాయి. ఆవుల విలువ రూ.30వేలు ఉంటుందని బాధితుడు తెలిపారు.