
టీఎల్‌యూడీ పద్ధతిలో బయోచార్ తయారీ
సుజాతనగర్: టీఎల్‌యూడీ (టాప్ లిట్ అప్‌డ్రాఫ్ట్) పద్ధతిలో నాణ్యమైన బయోచార్ తయారు చేయవచ్చని కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ అన్నారు. మండలంలోని వేపలగడ్డకు చెందిన కుందూరు లక్ష్మీనారాయణరెడ్డి వెల్డింగ్ దుకాణంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన బయోచార్ యూనిట్ ప్రక్రియను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా 30 కిలోల వేస్ట్ కట్టె ముక్కలను చిన్నచిన్న ముక్కలుగా చేసి మండించడం ద్వారా 10 కిలోల నాణ్యమైన బయోచార్‌ను కలెక్టర్ తయారు చేయగలి గారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఇలా తయారైన బయోచార్‌ను ఆవుపంచకం (ఆవుపేడ మొదలైనవి)తో కలిపి కొన్ని రోజులు నిల్వ ఉంచి ఆరబెట్టి, పొడిగా చేసి పంటలకు ఎరువుగా ఉపయోగించాలని సూచించారు. జిల్లాలోని రైతువేదికల ద్వారా బయోచార్ తయారీ విధానం గురించి రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో విరివిగా లభించే తుమ్మ చెట్టు కొమ్మలు, రహదారులు, కరెంట్ తీగలకు అడ్డంగా ఉన్న కొమ్మలను ఉపయోగించి తక్కువ ఆక్సిజన్‌లో టీఎల్‌యూడీ పద్ధతిలో బయోచార్ తయారు చేయాలని సూచించారు. స్వయం సహాయక సంఘాలు బయోచార్ తయారు చేసి, విక్రయించడం ద్వారా లాభం పొందొచ్చని సూచించారు. బయోచార్ తయారీ సమయంలో ఉత్పన్నమయ్యే వేడిని ఎలా ఉపయోగించుకోవచ్చో, బయోచార్ తయారీ విధానాన్ని మరింత తక్కువ ఖర్చు తో, సులభతరంగా రైతులు ఉపయోగించుకునేలా రూపొందించడానికి వివిధ పద్ధతులను పరిశీలిస్తున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో పీడీ విద్యాచందన, ఎంపీడీఓ బి.భారతి, ఏఓ నర్మద తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ జితేశ్ వి.పాటిల్