
డంపింగ్‌యార్డులో గిరిజనుల నిరసన
అశ్వారావుపేటరూరల్: తమ పట్టా భూములను జాయింట్ సర్వే చేసి అప్పగించాలని డిమాండ్ చేస్తూ గిరిజనులు వినూత్నంగా ఓ డంపింగ్‌యార్డు లో నిరసన వ్యక్తం చేశారు. మండలంలోని రామన్నగూడేనికి చెందిన 150 మంది గిరిజనులకు సర్వే నంబర్లు 30,36, 39లో 573 ఎకరాలకు సంబంధించి తమ పూర్వీకుల నుంచి పట్టాలు కలిగి ఉన్నారు. కాగా, ఈ భూములు కొన్నేళ్లుగా అటవీ, ఎఫ్‌డీసీ ఆధీనంలో ఉండగా ఆయా భూముల్లో టేకు, వెదు రు ప్లాంటేషన్లు ఉన్నాయి. ఈ భూములను నాటి ఉమ్మడి జిల్లా కలెక్టర్‌తోపాటు హైకోర్టు పూర్వ పట్టాలు ఉన్న గిరిజనులకు సర్వే చేసి అప్పగించా లని 13 ఏళ్ల కిందటే ఉత్తర్వులు జారీ చేశారు. కానీ, ఈ భూములను జాయింట్ సర్వే చేసేందుకు రెవెన్యూ, ఫారెస్టు, ఎఫ్‌డీసీ అధికారులు ముందుకు రాకపోవడంతో ఏళ్లుగా గిరిజనులు తమ భూము లు అప్పగించాలని దశలవారీగా పోరాటాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం కూడా రామన్నగూడెం పంచాయతీ డంపింగ్ యార్డులో బాధిత గిరిజనులు తమ వద్ద ఉన్న పూర్వ పట్టాలను చేతుల్లో పట్టుకొని గంటపాటు నిరసన వ్యక్తం చేసి, జాయింట్ సర్వే చేయాలని డిమాండ్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.