
గిరిజన సంక్షేమానికి నిరంతరం కృషి
భద్రాచలంటౌన్: మంచిర్యాల జిల్లాలో స్థానిక సంస్థల జేసీగా పనిచేసిన సమయంలో విద్యార్థుల అభివృద్ధికి కొన్ని నిర్ణయాలు తీసుకుని, అమలు చేయడంతో సత్ఫలితాలు వచ్చాయని, అదే తరహాలో ఐటీడీఏ పీఓగా బాధ్యతలు చేపట్టిన్నప్పటి నుంచి గిరిజన సంక్షేమానికి తన వంతు కృషి చేస్తున్నానని పీఓ బి.రాహుల్ తెలిపారు. ఐటీడీఏ పీఓగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీఓ పాల్గొని మాట్లాడారు. గిరిజన విద్యను పునాది నుంచి బలోపేతం చేసేందుకు ఉద్దీపకం వర్క్ బుక్ ప్రవేశపెట్టామని, మంచి ఫలితాలు వచ్చాయని, పదో తరగతి పూర్తయిన విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ కార్యక్రమం రూపొందించి మంచి ఫలితాలు సాధించా మని పేర్కొన్నారు. గిరిజన సంస్కృతి, సంప్రదా యాలు అంతరించిపోకుండా మ్యూజియం రూపకల్పనలో అధికారులు, కిందిస్థాయి సిబ్బంది సహకారం మరిచిపోలేనిదన్నారు. అనంతరం యూనిట్ అధికారులు సిబ్బంది సమక్షంలో కేక్ కట్ చేశారు. పీఓను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఏపీఓ డేవిడ్‌రాజ్, డీడీ మణెమ్మ, ఆర్సీఓ అరుణ కుమారి, హరీశ్, భాస్కర్, ఉదయ్‌కుమార్, సున్నం రాంబాబు, అశోక్‌కుమార్, రమేశ్, భాస్కర్‌నాయక్, సమ్మయ్య, చైతన్య, జేడీఎం హరికృష్ణ, ఆదినారా యణ ఐటీడీఏ కార్యాలయంలోని అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
దత్తత గ్రామాల అభివృద్ధికి ప్రణాళిక
గవర్నర్ దత్తత తీసుకున్న గ్రామాల్లోని కొండరెడ్ల గిరిజనుల అభివృద్ధి కోసం విడుదల చేసిన నిధులను సక్రమంగా వినియోగిస్తామని పీఓ రాహుల్ తెలిపారు. రాజభవన్ క్యాంప్ కార్యాలయం నుంచి గవర్నర్ ఆఫ్ తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రెటరీ దానకిశోర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పీఓ రాహుల్‌తో శుక్రవారం సమీక్షించారు. జిల్లాలోని దమ్మపేట మండలంలోని పూసుకుంట, అశ్వారావుపేట మండలంలోని గోగులపూడి గ్రామాల్లోని కొండరెడ్ల సంక్షేమానికి రూ.48.17 లక్షలు విడుదల చేశామని, వాటిని కేవలం కొండరెడ్ల కుటుంబాల రైతులు, నిరుద్యోగ యువత కోసం, మౌలిక వసతుల కల్పనకు వినియోగించాలని సూచించారు. అనంతరం పీఓ మాట్లాడుతూ.. పూసుకుంట, గోగులపూడిలో నిరుద్యోగులకు టెంట్‌హౌస్‌లు, రైతులకు రెండు పవర్ టిల్లర్లు, 20 సోలార్ పంపుసెట్లు అందిచామన్నారు. ఇంకా జరిగిన అభివృద్ధి పనులను వివరించారు.
ఏడాది పూర్తయిన సందర్భంగా పీఓ రాహుల్