
బొప్పాయి.. మేలోయి
పంట సాగుతో పెట్టుబడికి రెట్టింపు ఆదాయం
● ఉమ్మడి జిల్లాలో 2 వేల ఎకరాల్లో సాగు ● ఎకరాకు 25 టన్నుల వరకు దిగుబడి ● రూ. 20 వేల వరకు పలుకుతున్న టన్ను ధర
ఖమ్మంవ్యవసాయం: అధిక ఆదాయాన్ని ఇచ్చే ఉద్యాన పంటల్లో బొప్పాయి ఒకటి. ఇతర ఉద్యాన పంటలతో పోలిస్తే ఇది తక్కువ కాలపు పంట. మొక్క వేసిన తొమ్మిది నెలల్లో ఉత్పత్తి ప్రారంభమవుతుంది. తోటలకు నాలుగేళ్ల పాటు అవకాశం ఉన్నా ఏడాదిన్నర నుంచి రెండేళ్ల వరకే దిగుబడి పొందుతూ ఆ తర్వాత తొలగిస్తున్నారు. మార్కెట్‌లో బొప్పాయికి డిమాండ్ పెరగడంతో రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. బొప్పాయితో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జ్వరం, ఇతర వ్యాధులు సోకినప్పుడు బొప్పాయి పండు తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇది జీర్ణ వ్యవస్థను కూడా మెరుగు పరుస్తుంది. చర్మం, కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వివిధ రకాల విటమిన్లు, పోషకాలను ఇస్తుండగా దీనికి డిమాండ్ పెరిగింది. ఈ పంట సాగు పెరిగినప్పటికీ.. దీనికి కూడా ప్రకృతి వైపరీత్యాల సమస్య ఉంది. ఈదురుగాలులు వచ్చినప్పుడు దెబ్బతినే ప్రమాదం ఉంది.
2 వేల ఎకరాల్లో సాగు..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2 వేల ఎకరాల్లో బొప్పాయిని రైతులు సాగు చేస్తున్నారు. జిల్లాలోని రఘునాథపాలెం, ఖమ్మం అర్బన్, కామేపల్లి, కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, బోనకల్, చింతకాని, ముదిగొండ, మధిర, వైరా, ఏన్కూ రు, తల్లాడ తదితర మండలాల్లో 1,700 ఎకరాల్లో ఈ పంట సాగు చేస్తుండగా, భద్రాద్రి జిల్లాలోని జూలూరుపాడు, సుజాతనగర్, ఇల్లెందు, టేకులపల్లి, బూర్గంపాడు, దమ్మపేట, అన్నపురెడ్డిపల్లి తది తర మండలాల్లో 300 ఎకరాల్లో సాగులో ఉంది.
ఖర్చుకు డబుల్ ఆదాయం..
బొప్పాయి సాగు పెట్టుబడి ఎకరాకు రూ.లక్ష వరకు ఖర్చవుతుంది. మొక్కలు, డ్రిప్, మల్చింగ్, దుక్కులు చేయడం తదితర ఖర్చులుంటాయి. అయితే ప్రభుత్వం ఈ పంట సాగుకు ప్రోత్సాహకంగా ఎకరాకు రెండేళ్ల కాలానికి రూ. 27వేల వరకు ఇస్తుంది. ఇక ఎకరాకు ఆదాయం రూ.2 లక్షలకు పైగా వస్తుంది. ఉమ్మడి జిల్లాలో సాగు చేసే బొప్పాయి ఎకరాకు 25 టన్నుల వరకు దిగుబడి వస్తోంది. పంట వేసిన 9 నెలల నుంచి ఉత్పత్తి ప్రారంభం అవుతూ ప్రతీ 15 రోజులకు ఒకసారి చేతికందుతుంది. మొదటి 8 కోతల కాయ బాగా నాణ్యంగా ఉంటుంది. ఆ తర్వాత కొంతమేరకు నాణ్యతతో పాటు సైజ్ కూడా తగ్గుతాయి. 20 నుంచి 22 టన్నుల వరకు నాణ్యమైన, 3 నుంచి 5 టన్నులు కొంత తక్కువ నాణ్యత గల కాయలు దిగుబడి అవుతాయి.
టన్ను రూ.20 వేలు..
బొప్పాయి టన్ను ధర రూ.20 వేల వరకు పలుకుతుంది. ఢిల్లీ, కోల్‌కతా, ముంబయి ప్రాంతాల వ్యాపారులు ఇక్కడి తోటలను పరిశీలించి కాయ సైజు, నాణ్యత ఆధారంగా ధర నిర్ణయిస్తారు. మొదటి కోత టన్నుకు రూ. 18 వేల నుంచి రూ. 20 వేల వరకు, చివరి కోత రూ.10 వేల వరకు పెడుతున్నారు.