
ఆగుతూ.. సాగుతూ..
ప్రభుత్వ మెడికల్ కళాశాల భవన నిర్మాణాల్లో తీవ్ర జాప్యం
● బిల్లులు మంజూరుకాక రెండోసారి ఆగిపోయిన పనులు ● అద్దె భవనాల్లో హాస్టళ్లు, ఇరుకు గదుల్లో తరగతులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: నాలుగో ఏడాదిలోకి వస్తున్నా మెడికల్ కాలేజీ భవన నిర్మాణ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. అకడమిక్ తరగతి గదులు, హాస్టల్, మెస్, రెసిడెంట్ వైద్యుల క్వార్టర్లు వంటి నిర్మాణ పనులు శ్లాబ్ దశకు చేరుకున్న సమయంలో మరోసారి ఆగిపోయాయి.
ఆగిన పనులు
మెడికల్ కాలేజీ హాస్టల్, తరగతి గదులు, మెస్, రెసిడెంట్ డాక్టర్ల క్వార్టర్లు తదితర తొమ్మిది రకాల భవనాల నిర్మాణం జరుగుతోంది. అకడమిక్ క్లాసులు నిర్వహించే భవనం జీ ప్లస్ 4, బాయ్స్, గర్ల్స్ హాస్టళ్లు జీ ప్లస్ 5 పద్ధతిలో నిర్మించాల్సి ఉంది. మెస్, స్టాఫ్ క్వార్టర్స్ జీ ప్లస్ 2గా నిర్మించాల్సి ఉంది. 2023 ఆరంభంలో పనులు మొదలవగా 2024 డిసెంబరు నాటికి పూర్తి కావాల్సి ఉంది. నిధుల విడుదలలో జాప్యం కారణంగా నిర్మాణ పనులు ఆగుతూ సాగుతున్నాయి. ప్రస్తుతం భవన నిర్మాణ పనులు శ్లాబ్ దశకు చేరుకోగా రూ. 75 కోట్ల మేర పనులు జరిగినట్టు తెలుస్తోంది. ఇంకా తలుపులు, కిటికీలు, డ్రెయినేజీ, ఎలక్ట్రికల్ తదితర పనులు చేయాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రూ.30 కోట్లకు పైగా పేరుకుపోవడంతో పనులు మధ్యలోనే ఆగినట్టు తెలుస్తోంది.
నాలుగేళ్లుగా
కరోనా సంక్షోభం తర్వాత వైద్యసేవల రంగాన్ని విస్తరించడంలో భాగంగా కొత్త మెడికల్ కాలేజీలను అప్పటి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు చేసింది. ఈ క్రమంలో జిల్లాకు 2021లో వైద్య కళాశాల మంజూరైంది. దీనికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ కూడా వచ్చింది. మెడికల్ కాలేజీ కంటే నర్సింగ్ కాలేజీ భవనాలు ముందుగా నిర్మించారు. దీంతో నర్సింగ్ కాలేజీ కోసం నిర్మించిన భవనాల్లోనే మెడికల్ కాలేజీ కొనసాగుతోంది. మరోవైపు అద్దె భవనంలో నర్సింగ్ కాలేజీ నడుస్తోంది. కాలేజీ మంజూరై నాలుగేళ్లు పూర్తయినా ఇప్పటికీ భవనాలు పూర్తి కాలేదు.
ఇరుకు హాస్టళ్లలో..
మెడికల్ కాలేజీలో మొదటి బ్యాచ్ విద్యార్థులు 2022 నవంబర్‌లో చేరారు. ప్రస్తుతం మూడు బ్యాచ్‌లకు సంబంధించి 450 మంది విద్యార్థులు ఉన్నారు. బాయ్స్ హాస్టల్ కాలేజీ క్యాంపస్ ఎదురుగా ఉన్న మంచికంటి నగర్ ఏరియాలో, గర్‌ల్స్ హాస్టల్ పాల్వంచ మార్కెట్ ఏరియాలో అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. మూడు బ్యాచ్‌ల విద్యార్థులు రావడంతో ఇప్పటికే అద్దె భవనాలు కిక్కిరిసి ఉన్నాయి. అద్దె బిల్లులు కూడా సకాలంలో రాకపోవడంతో భవనాల యజమానులు సైతం గుర్రుగా ఉంటున్నారు. ఈ ఏడాది నాలుగో బ్యాచ్‌లో మరో 150 మంది విద్యార్థులు రాబోతున్నారు. కనీసం ఈ ఏడాది చివరి నాటికై నా కొత్త భవనాలు అందుబాటులోకి రాకపోతే విద్యార్థులకు ఇక్కట్లు తప్పవు. ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి పెండింగ్ బిల్లులు వచ్చేలా చూడాలని మెడికల్ కాలేజీ విద్యార్థులు, అధ్యాపకులు కోరుతున్నారు.
పెరుగుతున్న వ్యయం
మెడికల్ కాలేజీ భవన నిర్మాణ పనులు 2023లో మొదలయ్యాయి. బిల్లులు మంజూరు కావడం లేదంటూ నిర్మాణ పనులు పునాదుల దశలో ఉండగానే అదే ఏడాది జూన్‌లో కాంట్రాక్టర్ పనులు నిలిపేశాడు. ఆ తర్వాత ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో 2024 జూన్ వరకు ఏడాదిపాటు ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. చివరకు మంత్రి పొంగులేటి చొరవతొ రూ. 30 కోట్లు మంజూరుకాగా 2024 జూలైలో మళ్లీ పనులు ఊపందుకున్నాయి. ఇదే జోరులో ఈ ఏడాది చివరికై నా భవనాలు అందుబాటులోకి వస్తాయనుకుంటే సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ఆలస్యం కారణంగా నిర్మాణ వ్యయం కూడా పెరుగుతోంది. ఆరంభంలో భవనాల నిర్మాణ వ్యయం రూ. 105 కోట్లు ఉండగా, తొలి సవరణలో రూ.130 కోట్లకు చేరింది. ప్రస్తుతం అది రూ.147 కోట్లకు చేరుకుంది.

ఆగుతూ.. సాగుతూ..