
చెరువుల అభివృద్ధేది?
● ఐదేళ్లుగా నిలిచిన పూడిక తీత పనులు ● అలుగులు, తూములకు మరమ్మతులు ● మిషన్ కాకతీయ తర్వాత చెరువుల అభివృద్ధికి గ్రహణం
బూర్గంపాడు: చెరువుల్లో మట్టి పూడికలతో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. తూములు, అలుగులు మరమ్మతులకు గురై నీటి వృథా జరుగుతోంది. చెరువు కట్టలు బలహీనపడి తరుచూ తెగిపోతున్నాయి. దీంతో పంట చివరి దశలో నీరు సరిపోక పైర్లు ఎండుతున్నాయి. ఐదేళ్లుగా చెరువుల అభివృద్ధికి చర్యలు చేపట్టకపోవటంతో ఆయకట్టు రైతులకు ఇబ్బందులు తప్పటం లేదు.
2015 నుంచి 2019 వరకు..
గత ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణ కోసం మిషన్ కాకతీయ పథకాన్ని అమలు చేసింది. 2015 మార్చి 12న ఈ పథకం ప్రారంభించగా, 2019 వరకు ప్రతి ఏటా వేసవిలో అభివృద్ధి పనులు చేపట్టారు. ఏళ్ల తరబడి చెరువులలో పూడుకుపోయిన మట్టిని యంత్రాలతో తీయించారు. సారవంతమైన ఆ మట్టిని రైతులు పంట భూములలో వేసుకున్నా రు. చెరువులకు కొత్తతూములు వేయించారు. అలుగులను పునర్నిర్మించారు. చెరువు కట్టలపై మట్టిపోసి పటిష్టపరిచారు. దీంతో చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి పంటలకు ఉపయోగపడింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని మెచ్చుకుంటూ పలు అవార్డులు అందించింది. వివిధ ప్రభుత్వ శాఖలు కూడా చెరువులను దత్తత తీసుకుని అభివృద్ధి పనులు చేపట్టారు. జిల్లాలో 1850 పైగా పెద్ద, చిన్న చెరువులు ఉండగా, ఈ పథకంలో 870 చెరువులను అభివృద్ధి చేశారు. చిన్న చెరువులను ఉపాధిహామీ పథకంలో కొంతమేర అభివృద్ధి చేశారు.
2019 తర్వాత పట్టించుకోలేదు..
నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2019 తర్వాత మిషన్ కాకతీయ పథకాన్ని పెద్దగా కొనసాగించలేదు. నాటి నుంచి నేటి వరకు చెరువుల అభివృద్ధి పనులు ఎక్కడ కూడా జరగటం లేదు.ఐదేళ్ల క్రితం వర్షాలకు, భారీ వరదలకు మట్టి కొట్టుకొచ్చి మిషన్ కాకతీయ పథకంలో అభివృద్ధి చేసిన చెరువుల్లో పూడిక పేరుకుపోయింది. వరద ఉధృతికి అలుగులు మరమ్మతులకు గురయ్యాయి. తూములు లీకయ్యాయి. ప్రస్తుత ప్రభుత్వం కూడా చెరువుల అభివృద్ధిపై దృష్టి పెట్టకపోవటంతో రైతులు సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. పూడిక మట్టిని రైతులు చేలలోతోలుకునేందుకు కూడా ఎక్కువ ఖర్చవుతుండటంతో రైతులు ఆ ప్రయత్నాలను మానుకున్నా రు. గత వానాకాలం సీజన్ చివరిలో చెరువులలో నీరు లేకపోవటంతో రైతులు పంటను కాపాడుకునేందుకు చాలా ఇబ్బందులు పడ్డారు. దూరంలో ఉన్న బోరుబావుల నుంచి పైప్‌లైన్లు వేసుకుని పంటలు కాపాడుకున్నారు. ప్రభుత్వం చెరువుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
పూడిక తీయాలి
చెరువుల్లో పూడిక మట్టి తీస్తే ఓ విడత తడికి నీరు అదనంగా అందుతుంది. వానాకాలం వరి పొట్టదశలో చెరువుల్లో నీరు అడుగంటడంతో ఇబ్బందులు పడ్డాం. పూడిక తీతలో వచ్చే మట్టిని చేలలో వేసుకుంటే మూడేళ్లు పంటలు బాగా పండుతాయి. ప్రభుత్వం చెరువుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి.
–వై.నర్సింహారెడ్డి, రైతు, రెడ్డిపాలెం
అభివృద్ధి చేయాలి
గతంలో మాదిరి ప్రభుత్వం చెరువుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. మిషన్ కాకతీయలో చెరువులు అభివృద్ధి చేయటంతో ఐదేళ్లు ఇబ్బందులు లేకుండా పంటలు పండాయి. గతేడాది భారీ వర్షాలు, వరదలకు చెరువులలో మళ్లీ పూడిక చేరింది. మళ్లీ చెరువులలో పూడికలు తీయిస్తే ఉపయోగకరంగా ఉంటుంది.
–బి.లోక్యా, రైతు, కృష్ణసాగర్

చెరువుల అభివృద్ధేది?

చెరువుల అభివృద్ధేది?