
13 తులాల బంగారం చోరీ
మణుగూరు టౌన్: పట్టణంలోని ఓ దుకాణంలో సిబ్బంది ఉండగానే కళ్లుగప్పి చోరీకి పాల్పడిన సంఘటన శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. అంబేద్కర్ సెంటర్ వద్ద ఉండే శ్రీవారి బంగారు దుకాణంలో మధ్యాహ్నం ఓ వ్యక్తి ప్రవేశించి దుకాణం సిబ్బంది ఉండగానే షో కేసులో ఉన్న బంగారు నగలు అపహరించి తన వెంట తెచ్చుకున్న చేతి సంచిలో వేసుకుని పరారయ్యాడు. కొద్దిసేపటికి 13 తులాల బంగారం చోరీ అయినట్లు గుర్తించిన యజమాని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. డీఎస్పీ రవీందర్‌రెడ్డి, ఇన్‌చార్జి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ మేడా ప్రసాద్ సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. సీసీ ఫుటేజీని పరిశీలించగా, చోరీ దృశ్యం రికార్డయినట్లు తేలింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దుకాణంలో సిబ్బంది కళ్లుగప్పి అపహరణ