
ఎల్‌ఆర్‌ఎస్‌కు తిప్పలెన్నో..
● అధికారుల చుట్టూ ప్లాట్లదారుల ప్రదక్షిణలు ● నిషేధిత స్థలం కాకున్నా జాబితాలోకి.. ● యజ్ఞంలా మారిన పరిశీలన, అనుమతులు
ఖమ్మం అర్బన్: స్థలాల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్(ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం)ను ప్రవేశపెట్టగా దరఖాస్తులదారుల వెసులుబాటు కోసం ఇటీవల ఫీజులో 25శాతం రాయితీ ప్రకటించింది. దీంతో తమ స్థలాలను క్రమబద్ధీకరించుకోవచ్చని, తద్వారా నిర్మాణానికి ఇక్కట్లు తీరతాయని భావించిన దరఖాస్తుదారులకు అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. గతంలో రూ.వెయ్యి చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారిని ప్రస్తుతం నిర్దేశిత ఫీజులో 25 శాతం రాయితీకి అర్హులుగా ప్రకటించారు. కానీ ప్రభుత్వం రూపొందించిన యాప్‌లో సాంకేతిక సమస్యలో లేక ఇతర కారణాలో తెలియదు కానీ యజమానులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫీజు చెల్లింపునకు అనుమతి జారీ కావడం లేదు.
దశల వారీగా...
ఎల్–1 దరఖాస్తులకు సంబంధించి కార్పొరేషన్ లేదా గ్రామపంచాయతీ అధికారులతో పాటు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అంతా సవ్యంగా ఉంటే యాప్‌లో అప్‌లోడ్ చేసి అనుమతి ఇస్తున్నారు. కానీ నిషేధిత జాబితాలో చేర్చిన భూముల విషయంలో ఇక్కట్లు ఎదురవుతున్నాయి. మూడు శాఖల అధికారులకు ఒకేసారి సమయం లభించి క్షేత్రస్థాయికి వస్తేనే ప్లాట్ ప్రభుత్వ భూమిలో ఉందా, ఎఫ్‌టీఎఫ్ పరిధిలో ఉందా అనేది నిర్ధారించే అవకాశముంటుంది. ఇందుకోసం దరఖాస్తుదారులు అధికారుల చుట్టూ తిరిగి యాప్‌లో నమోదు చేయించుకున్నా... తిరిగి మరోమారు అనుమతి కోసం క్షేత్రస్థాయికి రావాల్సి ఉండడంతో కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇదంతా పూర్తయ్యాక ఎల్–2(టౌన్ ప్లానింగ్), ఎల్–3(ముఖ్య అధికారి జారీ చేసే పత్రం) దశల్లోనూ విపరీతమైన జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. ఇదంతా భరించలేక కొందరు తాము చెల్లించిన డబ్బు తిరిగి ఇచ్చేయాలని అధికారులను నిలదీస్తున్నట్లు సమాచారం. ఇదే అదనుగా కొందరు అంత దూరం రావాలంటే ఖర్చులు అవుతాయని డబ్బు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
రెండేసి సార్లు
కొన్ని ప్లాట్లకు సమీపాన ప్రభుత్వ భూమి అసైన్డ్ భూములు లేదా వాగులు, వర్రెలు ఉంటే ఈ భూమిని కూడా నిషేధిత(ప్రొహిబిటెడ్) జాబితాలో చేర్చినట్లు సమాచారం. ఎప్పుడో కొనుగోలు చేసిన ప్లాట్లను నిషేధిత జాబితాలో చేర్చడం ఏమిటని ప్లాట్ల యజమానులు వాపోతున్నారు. ఇలాంటి ప్లాట్లను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాకే రాయితీతో ఫీజు చెల్లింపునకు అనుమతి ఇస్తుండడం గమనార్హం. అంతా పూర్తయి ఫీజు చెల్లించినా అనుమతి పత్రం కోసం మరోమారు ఉన్నతాధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుండడం గమనార్హం.
మీ సేవ కేంద్రాలకు పరుగులు
ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలోనే యజమానులు అన్ని పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు. కానీ ఇప్పుడు మరోమారు అప్‌లోడ్ చేయాలని ప్లాట్లదారులకు సమాచారంవస్తోంది. దీంతో నెట్ సెంటర్లు, మీ సేవ సేవా కేంద్రాలకు పరుగుల తీయక తప్పడం లేదు. ఇప్పటికై నా సంబందిత శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ ఫీజు చెల్లింపునకు అవకాశం ఇవ్వాలని, ఆ వెంటనే అనుమతులు జారీచేయాలని పలువురు కోరుతున్నారు.