
నకిలీ విత్తనాలపై దృష్టి పెట్టాలి
అధికారులకు కలెక్టర్ ఆదేశం
సూపర్‌బజార్(కొత్తగూడెం): నకిలీ విత్తనాలపై టాస్క్‌ఫోర్స్ అధికారులు దృష్టి సారించాలని, వాటిని అరికట్టాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం టాస్క్‌ఫోర్స్ అధికారులు, ఇన్‌పుట్ డీలర్లకు కలెక్టర్, ఎస్పీ అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విత్తనాలు కొనుగోలు చేసే రైతులకు సంతకాలు చేసిన బిల్లులు ఇవ్వాలని సూచించారు. నాణ్యమైన విత్తనాలనే సరఫరా చేయాలని, ఎవరైనా చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో టాస్క్‌ఫోర్స్ కమిటీలు, ఇంటర్నల్ స్క్వాడ్, మండల క్వాలిటీ ఇన్‌స్పెక్టర్, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్, ఎస్పీ సూచించారు. సదస్సులో అదనపు కలెక్టర్లు డి. వేణుగోపాల్, విద్యాచందన, కేవీకే ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ డాక్టర్ వి.లక్ష్మీనారాయణమ్మ, డీసీఓ ఖుర్షీద్, డీహెచ్‌ఎస్‌ఓ కిశోర్, డీఏఓ వి.బాబురావు తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగ పిల్లలకు చదువే ప్రధానం
దివ్యాంగులైన పిల్లలకు చదువే ప్రధానమని కలెక్టర్ పాటిల్ అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అలాంటి చిన్నారులకు డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్, స్పెషల్ ఎడ్యుకేషన్, ఐఈడీ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, విద్యాశాఖ, ఐసీడీఎస్ అధికారులు పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. ఇక దివ్యాంగులకు యూడీఐడీ కార్డులు మంజూరు చేస్తామని, ఉపాఽధిహామీ పథకం ద్వారా అర్హులకు పని కల్పిస్తామని అన్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో ర్యాంపులు నిర్మిస్తామన్నారు. పౌరసరఫరాల శాఖ ద్వారా అంత్యోదయ కార్డులు, బ్యాటరీ ఆపరేటర్ సైకిళ్ల రిపేర్లకు టెక్నీషియన్లను నియమిస్తామని చెప్పారు. వయోవృద్ధులకు ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. అన్ని మండలాల్లో ఆయుర్వేదిక్ శిబిరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. సమావేశంలో ఎస్పీ రోహిత్‌రాజ్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఎస్సీ అభివృద్ధి అధికారి డి. అనసూర్య, ఏడీఎంహెచ్‌ఓ ఎస్.జయలక్ష్మి, మెప్మా పీడీ సీహెచ్. రాజేష్, ఉపాధి కల్పనాధికారి శ్రీరామ్, పరిశ్రమల అధికారి మధుసూదన్‌రెడ్డి, బీసీ సంక్షేమాధికారి ఇందిర, సీపీఓ కె సంజీవరావు, ఆర్డీఓలు మధు, దామోదర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
విద్యారంగానికి హెచ్‌ఎంలే మూలస్తంభాలు
కొత్తగూడెంఅర్బన్: ప్రభుత్వ విద్యా రంగాన్ని అభివృద్ధి చేయడంలో ప్రధానోపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని, వారే మూలస్తంభాల్లాంటి వారని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. స్థానిక జిల్లా విద్యా శిక్షణా కేంద్రంలో నాలుగు రోజులుగా కొనసాగుతున్న వృత్యంతర శిక్షణా కార్యక్రమంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. హెచ్‌ఎంలు మనసుపెట్టి పనిచేస్తే సాధించలేనిది ఏదీ లేదని, పాఠశాలల్లో సమాజ భాగస్వామ్యం పెంచుతూ పిల్లలకు నాణ్యమైన బోధన అందించాలన్నారు. అంతకుముందు పాతపాల్వంచలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న జీవశాస్త్ర ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. జీవశాస్త్రం చదవడంటే డాక్టర్‌గా స్థిరపడడమే అనే ఒక అపోహ నుంచి విద్యార్థులు బయటపడేలా చూడాలని, ఎన్నో వినూత్నమైన కోర్సులను అధ్యయనం చేస్తూ మానవాళికి అవసరమైన సహజ సిద్ధ ఆహార పదార్థాలను మొక్కల ద్వారా అందించొచ్చని చెప్పారు. ఈ విషయంలో ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి ఎ.నాగరాజశేఖర్, జీవశాస్త్ర శిక్షణా కేంద్ర ఇన్‌చార్జ్ ఎ. పద్మలత, రాష్ట్ర పరిశీలకులు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.